ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు యుధిష్ఠిరుని యౌవరాజ్యాభిషిక్తునింజేయుట (సం. 1-79-191)
వ. ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యుఁ గోపపాశబద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్ట్రుండు యుధిష్ఠిరు రాజ్యభారధురంధరుంగా నెఱింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన. 92
చ. నలువురు దమ్ములున్‌ బలిమి నాలుగుదిక్కులు నోర్చి సర్వభూ
తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా
సులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం
డలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁ డై.
93
వ. మఱియును. 94
క. బద్ధపరంపర నొప్పె మ | దోద్ధతగజరథతురంగయుద్ధముల గదా
యుద్ధములఁ జూడ నెందుఁ బ్ర | సిద్ధుఁడు మధ్యముఁడ యను విశిష్టస్తవముల్‌.
95
చ. అనుపమకార్ముకాదివివిధాయుధవిద్యలయందుఁ గోవిదుం
డనఁగ నజయ్యుఁ డై పరఁగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే
రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని
స్వనముఖరాబ్ధివేష్టిత విశాలమహీవలయాంతరంబునన్‌.
96
క. యము లమితశౌర్యు లరినృప | యము లమలచరిత్రనిరతు లనఁగా నత్యు
త్తమభక్తి నన్నలకు విన | యము మెఱయుచు నుండి రధికు లై బహుకళలన్‌.
97
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )