ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భారద్వాజుం డర్జునునకు బ్రహ్మశిరోనామకదివ్యబాణం బొసఁగుట (సం. 1-80-20)
వ. ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరఁగుచున్న నందు ధనుర్విద్య నర్జును దృఢముష్టిలాఘవలక్ష్యవేధిత్వదూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాదిప్రహరణప్రవీణతకుం బరమహీపాల పరాజయోత్పాదన పరాక్రమంబునకుఁ దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె. 98
ఉ. దీని నగస్తి నాఁ బరగు దివ్యమునీంద్రుఁడు దొల్లి ప్రీతితో
భూనుత! యగ్నివేశుఁ డను భూరిమునీంద్రున కిచ్చె; వారలున్‌
మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్‌;
దీనికి నీవ యర్హుఁడవు తేజమునం గడుఁ బెద్ద గావునన్‌.
99
వ. ‘దీని మానవులయందుఁ బ్రయోగింపకుండునది; యల్పతేజులయందుఁ బ్రయుక్తం బయి యిది జగంబులఁ గాల్చు; నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు’ నని దాని మహిమ చెప్పి ‘నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు నాతో నెన్నడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు; మిదియ నాకు గురుదక్షిణ’ యనిన నర్జునుండు వల్లె యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిష్ఠిరుయౌవరాజ్యాభిషేకంబునకు భీమార్జునయములపరాక్రంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె. 100
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )