ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కణికనీతి (సం. 1-81-10)
సీ. ‘ఆయుధవిద్యలయందు జితశ్రము | లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును | భయమందుచుండుదుఁ బాండవులకు;
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ | జేసె రా; జే నేమి సేయువాఁడ?
నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర | నా కెఱిఁగింపుఁడు నయముతోడ’
 
ఆ. ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు | నాప్తమంత్రి, నీతులందుఁ గరము
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు | నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె.
101
తరువోజ. ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత | దండవిధానంబుఁ దప్పక ధర్మ
చరితులఁగా మహీజనుల రక్షించి | సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములు
వరుసన తమతమ వర్ణధర్మముల | వర్తిల్లుదురు గడవక దండభీతి
నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి | యగు మహీవల్లభు ననుశాసనమున.
102
క. గుఱుకొని కార్యాకార్యము | లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్‌
మఱవక గురు నైనను జను |లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్‌.
103
క. ధీరమతియుతులతోడ | విచారము సేయునది మును, విచారితపూర్వ
ప్రారబ్ధమైన కార్యము | పారముఁ బొందును విఘాతపదదూరం బై.
104
క. జనపాలుఁడు మృదుకర్మం | బున నైనను గ్రూరకర్మమున నైనను నే
ర్పున నుద్ధరించునది త | న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్‌.
105
క. అమలినమతి నాత్మచ్ఛి | ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి
ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే | శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై.
106
క. బలహీను లైనచో శ | త్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ
ద్బలు లైన వారిఁ జెఱుపఁగ | నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్‌.
107
క. అలయక పరాత్మ కృత్యం | బులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూ
ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ | బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషండ తతిన్‌.
108
క. నానావిహార శైలో | ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా
స్థానముల కరుగునెడ మును | మానుగ శోధింపవలయు మానవపతికిన్‌.
109
తే. వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ | దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు | నాత్మరక్షాపరుం డగు నది విభుండు.
110
ఉ. ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
త్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గా
ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే.
111
క. పలుమఱు శపథంబులు నం | జలియును నభివాదనమును సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ | గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌.
112
క. తన కిమ్మగు నంతకు దు | ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కిమ్మగుడును గఱచును | ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌.
113
క. కడునలుకయుఁ గూర్మియు నే | ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్‌
బిడుగును గాడ్పును జనులకుఁ | బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్‌.
114
క. తఱియగునంతకు రిపుఁ దన | యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం
జెఱచునది ఱాతిమీదను | వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్‌.
115
క. తన కపకారము మునుఁ జే | సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన; దొకయించుక ముల్లయి | నను బాదతలమున నున్న నడవఁగ నగునే.
116
క. బాలుఁ డని తలఁచి రిపుతో | నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యు
త్కీలానలకణ మించుక | చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌.
117
క. మొనసి యపకారిఁ గడ నిడి | కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం
బున నుండి నిద్రవోయెడు | మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్‌.
118
చ. తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మఁగా
నొడివియు సత్యమిచ్చియుఁ జనున్‌ జననాథ! కృతాపకారులం
గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం
గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్‌.
119
వ. ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె. 120
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )