ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుఁడు తండ్రితోఁ దన మనోదుఃఖంబుఁ దెలుపుట (సం. 1-129-10)
తే. వీరు లని పాండుసుతులకు వెఱతు నేను; | వెఱచుటకుఁ దోడుగా నిప్డు విభుఁడ వీవు
పాండవజ్యేష్ఠునకుఁ బ్రీతిఁ బరమయౌవ | రాజ్య మిచ్చితి కురువృద్ధరాజులొద్ద.
121
వ. ‘దాననచేసి పౌర జానపద బ్రాహ్మణ ప్రధానవరులు ధర్మజున కనురక్తు లయి, నిన్నును భీష్ముని నాదరింపక, ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్థుండు గాఁడు, భీష్ముండు సమర్థుం డయ్యును ముందఱ రాజ్యభార నివర్తనంబునందుఁ గృతప్రతిజ్ఞం డయ్యెం; గావునఁ బాండవజ్యేష్ఠుం డైన యుధిష్ఠిరునకు రాజ్యాభిషేకంబు సేయుద; మతండు తరుణుం డయ్యును గుణవృద్ధుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు రాజ్యప్రతిష్ఠితుం డయ్యెనేని వృద్ధుల నమాత్యుల బంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగాఁ బూజార్హుల నెల్లం బూజించుఁ, బితామహుండైన భీష్ముని సపుత్త్రకుండైన ధృతరాష్ట్రుని నతిభక్తి నభీష్టభోగానుభవపరులంగా సుఖంబున నునుచు, దీనికి విదురుండును నొడంబడు నని యెప్పుడుఁ దమలో విచారింతు రని వింటిఁ; గర్ణశూలాయమానంబు లైన మూర్ఖప్రకృతుల పలుకులు విననోపఁ; బాండవుల నిప్పురంబువలనఁ బాయునట్లుగాఁ జేయవలయు; నేమి సేయుదు?’ ననినఁ గొడుకునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 122
చ. జనపతి యైనవానికిఁ బ్రచండమహాతుములాహవాంతరం
బున మృతిఁబొందియొండె, మఱి పుత్త్రులపైఁ దనరాజ్యభార మె
ల్లను నియమించి యేఁగి గిరులం దప మొప్పఁగఁ జేసి యొండెఁ గా
కనిమిషలోకభోగసుఖ మందఁగఁ బోలునె శాశ్వతంబుగన్‌.
123
వ. రా జయ్యెడువాఁడు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు; నేను షడంగసహితంబుగా వేదాధ్యయనంబు సేసియు నర్థశాస్త్రంబునందుఁ గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం బరచక్రంబులకుం బ్రతివ్యూహంబు రచియింప నేరమింజేసి రాజ్యంబునకుఁ దగకున్న. 124
ఉ. లోకనుతుండు పాండుఁ డమలుండు మహాగుణరత్నపూర్ణర
త్నాకరుఁ డత్యుదారమతి నంధుఁడ నైనను నన్ను రాజుఁగాఁ
జేకొని నాకు భక్తిఁ బనిసేయుచు సర్వజగజ్జిగీషుఁ డై
యీకురువంశరాజ్యభర మింతయుఁ దాల్చెఁ బరాక్రమంబునన్‌.
125
క. పరచక్రపతులచే భీ | కరుఁ డై ధనరాసు లదిమి కప్పము గొని చె
చ్చెరఁ దెచ్చియిచ్చి నన్నును | భరతకులశ్రేష్ఠుఁ డునిచె బహుయజ్ఞములన్‌.
126
వ. ‘మఱియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్నపాండురాజు కుమారుల నెవ్విధంబునఁ బాపనేర్తు’ నని దుఃఖించిన ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె. 127
సీ. పైతృకం బగు లక్ష్మి పాండుభూపతి మున్ను | తాల్చుటఁజేసి తత్తనయుఁ డైన
ధర్మజుఁ డిప్పుడు దాల్చిన, నాతని | తనయుండు మఱి దానిఁ దాల్చు, మీఁద
నిప్పాటఁ బాండువంశేశుల వసుమతీ | రాజ్యార్హు లగుదురు; రాజ్యమునకుఁ
బరువడి మే మింతఁ బాసిన మాపుత్త్ర | పౌత్త్ర వర్గంబునుఁ బాయు; నింక
 
ఆ. నొరులఁ గొలిచి కుడువనోప మే; మట్లుగా | కుండ మమ్ముఁ జేయనోపుదేని
పాండురాజుతొంటిభక్తియు నప్పాండు | తనయులందు దయయుఁ దలఁపకుండు.
128
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )