ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుఁడు పాండవులను వారణావతంబునకుఁ బంపు మని తండ్రితోఁ జెప్పుట (సం. 1-130-8)
వ. ‘ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది; ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు నప్రయత్నలభ్యంబగుఁ దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటంజేసి యెల్లవారును ధర్మరాజురాజ్యంబ వలతురు; దాని నెఱింగియ కాదె యేను నిత్యదానసమ్మానంబులం బ్రకృతిజనంబులకు సంతోషంబు సేయుచునుండుదు; నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబునఁ గొంతినిఁ బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము; మనకు రాజ్యంబు సుప్రతిష్ఠితం బైన మఱి వార లిందులకు వత్తు’ రనిన దుర్యోధనునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 129
తరువోజ. ‘ఏ నెల్లప్రొద్దు నా యెడ లోనఁ దలఁతు నీయభిప్రాయంబ; యిది దారుణంబు
గాన వాకునకుఁ జుల్కన తేరనోపఁ; గడఁగి పాండవుల నేకత మెట్టు లనుప
గా నగు? మఱి దీని గాంగేయవిదురకలశజాశ్వత్థామ గౌతముల్‌ బుద్ధి
గా నొడంబడుదురె? కా దయ్య!’ యనినఁ గౌరవజ్యేష్ఠుండు ఘనుఁ డిట్టు లనియె.
130
వ. ‘భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు; వారు కౌరవులకెల్ల సము లై యుండియు నావారల; యెట్లనిన; నశ్వత్థామ నా కిష్టుం డగుట నన్నుఁ బాయకుండు; పుత్త్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని భాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు; మఱి భీష్ముండు మధ్యస్థుం డగుటఁ బాండవులం బరిగ్రహింపఁడు; విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు సేయనోపండు; గావున నిక్కార్యంబున దోషంబు లేదు; వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న న్నుద్ధరింపు’ మని ధృతరాష్ట్రు నెట్టకేలకు నొడంబఱిచి దుర్యోధనుం డప్పుడు. 131
క. వలను గల మంత్రివరులం | బిలిచి పృథానందనులకుఁ బ్రియముగ మీ రి
మ్ముల వారణావతంబును | వెలయఁగఁ బొగడుండు వారు విని తగుల నెడన్‌.
132
వ. అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారనమ్రశాఖావిశాలతరువనరేఖాలంకృతం బనియును, వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభిశోభితం బనియును, నవసుధా ధౌతసౌధ సుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును, నిరస్తదోషానుషంగమంగళ మహారత్న రాజివిరాజితవిపులవిపణివీథీవిహసితాలకావిలాసం బనియును, మనోరమానేకసుఖానుభోగ భోగిమహాభాగ జనసమృద్ధం బనియును, బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల జాతకౌతూహలచిత్తులం జేసి యున్నఁ, గొండొకకాలంబునకు ధృతరాష్ట్రుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి యొక్కనాఁడు. 133
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )