ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
ధృతరాష్ట్రుండు పాండవులను వారణావతనగరంబునకుఁ బోవఁ బనుచుట (సం. 1-131-2)
ఉ. పాండుకుమారులం బిలువఁబంచి సుహృన్నివహంబు నొద్ద న
ప్పాండుఁ దలంచి నిర్గళితబాష్పకరాళకపోలయుగ్ముఁ డై
పాండుమహీశుకంటె నతిభక్తుల మి మ్మొకఁ డేను బంచెదం
బాండుయశో-ర్థులార! యిది పథ్యము కాఁగఁ దలంపుఁ డాత్మలోన్‌.
134
క. విదితంబుగఁ బుణ్యామర | నదీ సమీపమున వారణావత నగరం
బది సర్వసుఖాస్పద మని | వదలక వర్ణింతు రెల్లవారును దానిన్‌.
135
క. మీరును గుంతియు సహపరి | వారమహామాత్య భృత్యవర్గులరై నా
నారాజ్యలీలతోఁ జని | సారమతిం జేయుఁ డందు సతతోత్సవముల్‌.
136
వ. ‘పశుపతి నివాసం బయిన యప్పుణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్యగోహిరణ్యాదిమహాదానంబుల బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందుఁ గొండొకకాలం బుండి వచ్చునది’ యని పంచిన వల్లె యని పాండవులు గాంధారీధృతరాష్ట్రులకు మ్రొక్కి వీడ్కొని, దుర్యోధనాదుల నందఱం బ్రియపూర్వకంబుగా సంభావించి, భీష్మద్రోణవిదురకృపాదులకు మ్రొక్కి యనేకవృద్ధబ్రాహ్మణులకు నమస్కారంబు సేసి వారలవలన దీర్ఘాయురారోగ్య స్వస్తివచనంబులతోఁ బునర్దర్శనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖు లయినంత. 137
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )