ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుఁడు లాక్షాగృహనిర్మాణమునకై పురోచనుని వారణావతంబునకుఁ బంపుట (సం. 1-132-2)
క. తనవగచినకార్యము దొర | కొనుటకు ధృతరాష్ట్రపుత్త్రకుఁడు పొంగి పురో
చనుఁ బిలిపించి రహస్యం | బున వానికిఁ గరమునెయ్యమున ని ట్లనియెన్‌.
138
తరలము. అలఘుతేజుల వారణావత మన్పురంబునఁ బాండవే
యులఁ బ్రియంబున నుండఁబంచె గుణోన్నతుండు కురుప్రభుం;
డలయ కిప్పుడు నీవు మున్‌ చని యందు వారికి నుండఁగా
నిలయముల్‌ రచియింపు నీదగునేర్పుఁ జూతము చెచ్చెరన్‌.
139
వ. నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ; యిది యనన్యవిషయం బయిన కార్యంబు; కావున నీవ దీనిం జేయవలయు; వాయుజవంబు లయిన వేసడంబులఁ బూనిన యరదం బెక్కి, నేఁడ చని వారణావతంబున లాక్షాసర్జకరసమిశ్రం బై ఘృతతైలార్ద్రంబయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శాల విశాలంబుగా నాయుధశాల సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళితంబుగా నిర్మించి యందుఁ బాండవుల నునిచి వార లేమఱి నమ్మి కొండొకకాలం బుండ, ని న్నొరు లెఱుంగకుండ నిమ్మయినయవసరంబునం దద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొలిపి పగఱ పంచత్వం బెఱింగి రమ్ము. 140
క. ఈ కార్య సిద్ధి యగుడును | నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా
కేకాధిష్ఠిత మగు నిది | నీకును నిత్యోపభోగనిలయమ కాదే.
141
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )