ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
వారణావతప్రస్థానము - విదురోపదేశము (సం. 1-133-4)
వ. అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె; నిట యుధిష్ఠిరభీమార్జునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్ద శత్రయోదశవర్షజాతు లయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్ర విద్యలం గఱచుచుం బదమూడేం డ్లుండి, యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీ సహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్రియప్రముఖానేక జనంబులు శోక సంతప్తహృదయు లయి. 142
సీ. ‘ఇప్పాండుపుత్త్రుల నేలకో ధృతరాష్ట్రుం | డేకత మనుపంగ నిచ్చగించె;
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు | లేల వారింపరో యెఱుఁగరొక్కొ;
పితృపితామహులచే భృతపూర్వమై క్రమా | గత మైన రాజ్యంబుఁ గరము నెమ్మిఁ
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు | ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
 
ఆ. యేల వృద్ధరాజు లెడసేసిరో; పార్థుఁ | డరుగు నెడక మనము నరిగి యతని
యున్న చోన ప్రీతి నుండుద; మిం దుండ | నేల?’ యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి.
143
వ. తన పిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి ‘పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయి వచ్చెద’ మని యందఱం గ్రమ్మఱించి, చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి, విదురుం డొరులు వినియును నెఱుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనా విశారదుం డైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి, కొడుకులం గౌఁగిలించుకొని, కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱి చనియె; నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యి ట్లనియె. 144
తే. విదురుఁ డేతెంచి యొరులకు వినియు నెఱుఁగఁ| గానియ ట్లుండఁ బలికి నిన్‌ గఱపె బుద్ధి;
నట్ల చేయుదు నంటి వీ; వతని మతము | సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పు మయ్య!
145
వ. అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె. 146
ఆ. ఎల్లకార్యగతులు నెఱుఁగుదు; రయినను | నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగినంత;
పనియులేక మిమ్ముఁ బనిచిన కురుపతి | హితుఁడపోలె మీఁద నెగ్గు సేయు.
147
వ. ‘కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెఱుక గలిగి యుండునది’ యని బుద్ధిగఱపి మఱియు’ దుర్యోధనుచేసెడు దుష్క్రియ లిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె’ నని చెప్పిన విని, విదురుబుద్ధికిఁ దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచునిట్లు బాండవులు కతిపయప్రయాణంబుల వారణావతంబున కరుగునంత. 148
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )