ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
పాండవులు జననీసహితంబుగా వారణావతంబుఁ జేరుట (సం. 1-134-1)
సీ. వారణావతమునవా రెల్లఁ బాండవా | గమనంబు విని సంతసమునఁ బెరిఁగి
కరమొప్పఁ గరిరథతురగబలాఢ్యు లై | యెదురు వచ్చిరి మహాముదముతోడఁ;
గలయంగ గృహములఁ గలువడములు గడు | విలసిల్లె నంబరతలము గప్పి
మలయజమృగమదావిలసలిలంబుల | నిమ్ముగా నార్ద్రీకృతమ్ము లయిన
 
తే. యంగళుల నొప్పెఁ గర్పూరరంగవల్లు | లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య
తలము లెక్కిరి తత్పురీవిలసంబుఁ | జూచు పాండుకుమారులఁ జూచువేడ్క.
149
వ. పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న, కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసినచతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి; రంతం బరాభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె. 150
క. ఈ గృహ కుడ్యంబులు లా | క్షాగర్భము లాజ్య తైలగంధులు మఱి శ
స్త్రాగారసమీపము మా | యాగృహ మగు నిది యవశ్య మాగ్నేయం బై.
151
క. దీని తెఱఁ గెఱిఁగినట్ల మ | హానిపుణుఁడు విదురుఁ డురువిషాగ్నులవలనన్‌
మానుగ నేమఱకుం డని | తాను బ్రబోధించె నేకతమ ననుఁ బ్రీతిన్‌.
152
వ. ‘కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు’ ననిన విని భీముం డి ట్లనియె. 153
ఆ. ‘ఇట్టిదేని మనకు నిం దుండఁగా నేల? | యరిగి ముందు నున్నయంద యుండి,
యెఱిఁగి దీనితోన యిప్పురోచనుఁ గాల్చి | పోద’ మనిన ధర్మపుత్త్రుఁ డనియె.
154
క. ఎఱిఁగితిమి దీని తెఱఁ; గే | మఱ కెఱుఁగనియట్లు గూఢమతి నుండుద మిం
దఱముఁ బురోచనుకృతకము | నెఱి నేర్పడునంతకును వినీతాత్ముల మై.
155
వ. ఇప్పాపగృహప్రకారంబు మన మెఱంగుట పురోచనుం డెఱింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగు నట్లు గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మవిదురులు విని కోపించినం గురుకులసముద్రక్షోభం బగు; మఱి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెఱింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన. 156
సీ. ‘రాజ్యపదస్థుం డరాజ్యపదస్థులఁ | బక్షబలాఢ్యుఁ డపక్షబలుల
విపులార్థవంతుండు విగతార్థసార్థుల | నవసరం బెఱిఁగి వాఁ డశ్రమమున
దూష్యులఁ దుదిదాఁక దూషించు మనల న | న్నిష్ఠురునకు నది నీతిగాదె!
కావున నొరు లెఱుంగకయుండఁ గడు నమ్మి | నట్టుల యుండుద’ మని దినంబు
 
తే. లెల్ల వేఁటలాడుచు రాత్రులెల్ల నుద్య | తాయతాయుధహస్తు లై యనుదినంబు
నప్పురోచను వంచించి యనఘు లుండి | రప్రమాదు లై పాండవు లప్పురమున.
157
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )