ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
లాక్షాగృహదహనము (సం. 1-135-1)
వ. అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెఱింగి, కడువిశ్వాసి నొక్క ఖనకు నతి కుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వాఁడును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను నమ్మునట్లుగా విదురుసాభిజ్ఞానవచనంబు లెఱింగించి ‘యీకృష్ణచతుర్దశినాఁటిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి’ నని చెప్పి, లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెఱుంగకుండం జేసి, వారల కెఱింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెఱింగి యుండు నంత. 158
క. ధనదానములను బ్రియభో | జనదానములను విశిష్టసద్ద్విజతతులం
దనుపుచు నుండఁగఁ దత్పుర | మున షణ్మాసమున భరతముఖ్యుల కరిగెన్‌.
159
వ. ఆ కృష్ణచతుర్దశినాఁడు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న పానదానంబులం దుష్టి చేసి దేవపూజ గావించి యున్నెడం, బురోచనుపంపిననిషాదవనిత సపుత్త్రయై బహువిధవన్యమూల ఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీదేవింబాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును నెఱింగించు చుండెడు నది, నాఁటిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు నధికమధుపాన మదంబున మెయి యెఱుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన, నర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందఱఁ దాన యుత్సహించి వానిశయనగృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి, చెచ్చెరఁ దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని కనిచి, యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేసి, ఖనకునకుం దమకుశలగమనం బెఱింగించి, బిలప్రవిష్టుం డయి కుంతిని ధర్మార్జుననకుల సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు. 160
సీ. కడునిద్రఁ గానక తొడరుచు వడిగొని | నడవంగ నేరక తడయుచున్న
నెఱిఁగి, చెచ్చెరఁ దల్లి నఱకట నిడి, ధర్మ | సుతవిజయులఁ దనవితతబాహు
యమళంబు నెక్కించి, యముల నుత్సంగంబు | లెక్కించుకొని భీముఁ డక్కజముగ
నరిగెడు రయమునఁ దరులు సాల్పడి మ్రొగ్గఁ | బదఘట్టనంబులఁ జదిసి ఱాలు
 
ఆ. నుఱుము గాఁగ నిట్లు నెఱయంగ సత్త్వంబు | మెఱసి రాతి రెల్ల నుఱక పవన
తనయుఁ డరిగెఁ బవలు సనినట్లు చీఁకటి | యనక ముండ్లు గండ్లు ననక తెరలి.
161
వ. ఇట వారణావతంబున. 162
చ. అనుపమనిత్యసత్యరతు లై వినయాన్వితు లైన పాండునం
దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెఱుంగక యిట్టు లెగ్గు సే
సిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ
చనమయి లక్కయి ల్లతికృశానుశిఖాహతిఁ గ్రాఁగె గ్రక్కునన్‌.
163
వ. తదనంతరంబ ప్రభాతసమయం బగుడును. 164
చ. అతిదురితక్రియాభిరతుఁడైన పురోచనుతోన భస్మసా
త్కృత మయి చెడ్డ తద్విపులగేహముఁ దత్‌క్షణదగ్ధ మైనయా
కృతక విభూతి జాతుష నికేతనమున్‌ మఱి శస్త్ర వేశ్మమున్‌
ధృతి సెడి చూడఁగా నరుఁగుదెంచి జనుల్‌ గడు సంభ్రమంబుతోన్‌.
165
మధ్యాక్కర. ప్రో వైన భస్మంబు వాయఁ ద్రోచి య బ్బూదిలో నడఁగి
యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర
పావకదగ్ధ యై యున్నఁ జూచి, యప్పౌరులు దాని
భావించి కుంతియు సుతులు నని శోకపరవశు లగుచు.
166
మ. ‘బలవంతుల్‌ భరతాన్వయస్థితికరుల్‌ భాస్వద్భుజావీర్యని
ర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్‌ పాండవే
యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయమాయోత్థిత
జ్వలనజ్వాలలఁ గ్రాఁగిరే’ యనుచు సంజాతార్తులై రెంతయున్‌.
167
వ. అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పౌరులం గలసి భస్మంబు వాయఁ ద్రోచువాఁడపోలె నెవ్వరు నెఱుంగకుండఁ దనచేసిన బిలంబుద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో దగ్ధ యగుట యెఱింగి గజపురంబునకుం జని తద్వృత్తాంతంబును బాండవుల కుశలగమనంబును విదురునకుం జెప్పె; నిట వారణావతమ్మునవా రెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెఱింగి శోకించి, కుంతీ పాండవులపంచత్వంబు ధృతరాష్ట్రునకుం జెప్పి పుచ్చిన. 168
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )