ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
పాండవులు లక్కయింటఁ జచ్చి రని ధృతరాష్ట్రుండు దుఃఖించుట (సం. 1-137-10)
ఉ. బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ
ర్త్యాధము లైన సౌబలదినాధిపసూనులయొద్ద నప్దు దు
ర్యోధనుఁ డాదిగాఁగ సుతు లున్న సభన్‌ విని దుఃఖితాత్ముఁ డై
యా ధృతరాష్ట్రుఁ డా వఱచిన ట్లఱచెన్‌ వివిధప్రలాపుఁ డై.
169
వ. మఱియు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె; భీష్మాదికురువృద్ధులును విప్రులుం బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పాండవులకుశలస్థితి యెఱింగియు నెఱుంగనియ ట్లందఱం గలసి దుఃఖితుండపోలె నుండె; నంత ధృతరాష్ట్రుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల కుదకదానంబు సేసి సంస్కారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల నపారధనంబులతోడం బుచ్చిన. 170
క. మతిఁ బాండుకుమారుల పం | చత విని దుర్యోధనుండు సంతసపడియెన్‌;
హితుఁ డయిన పురోచను పం | చత కెంతయు జాతదుఃఖచంచలుఁ డయ్యెన్‌.
171
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )