ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
పాండవులు వారణావతముననుండి దక్షిణదిశగా నడచుట (సం. 1-137-17)
వ. అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాండమరీచిగోచరంబు గాని గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందఱ నెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునఁ జని సాయాహ్నంబున నొక్కవటమహీజాతశీతల శిలాతలంబున నునిచి దాని యగ్రవిటపం బెక్కి నీ రారయుచున్నంత ననతిదూరంబున. 172
మ. ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌఁ బద్మాకరం బంచుఁ ద
త్కమలామోదసుగంధ మారుతము వీఁకన్‌ ము న్నెఱింగించినన్‌
రమణం బిల్చె సరోవరం బనిలజున్‌ రాజీవరాజీ వస
త్సముదాళివ్రజచక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్‌.
173
వ. ఆ దిక్కున కా క్షణంబ యరిగి య క్కొలను గని యందుఁ గృతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్ఛిద్ర కమల పత్త్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మఱి వచ్చునంత. 174
క. ధరణీ దిశాప్రసారిత | గురుకరనికరంబు లుడిచికొని దీర్ఘనిరం
తరగతి ఖిన్నుఁడపోలెను | హరిదశ్వుఁడు విశ్రమించె నస్తాద్రిదరిన్‌.
175
ఉ. అంబురుహాప్తుఁ డస్తశిఖరాంతరితుం డగుడున్‌ సమస్త జీ
వంబులు నెల్లచో నిజ నివాసముఁ బొందునెడం దమిస్రపుం
జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా
గంబులయూధముల్‌ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై.
176
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )