ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీముఁడు నిద్రితు లైన జననీసోదరులను జూచి చింతిల్లుట (సం. 1-138-14)
వ. భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతులై పయి పుట్టంబులు పఱచుకొని తమ బాహుదండంబులు దలగడలుగా నిద్రితులయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖితుం డై యాత్మగతంబున. 177
క. త్రిభువనసామ్రాజ్యశ్రీ | ప్రభుఁ డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున
ట్లభిరూక్షతలంబున ని | ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై.
178
సీ. కుంతిభోజాధిపుకూఁతురు వసుదేవు | చెలియలు మఱియు విచిత్రవీర్యు
కోడలు కౌరవకులవిభూషణుఁ డైన | పాండుమహాదేవి పరమధర్మ
పరు లైన కొడుకులఁ బడసినయది పుష్ప | సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య
శయనతలంబున శయనించియును నిద్ర | వోవనియది దప్పిఁ బొంది కటికి
 
ఆ. నేల గుండ్లు లొత్త నిద్ర వోయిన యది; | తల్లికంటె నిద్రఁ దగిలి సుతులు
వాలుమృగము లున్న వన మని వగవక | మఱచియుండి; రేమి మాడ్కి యొక్కొ!
179
వ. ‘వీరికి నిద్రాభంగంబు సేయనోపఁ; దమకుం దార మేల్కొని నీళ్ళు ద్రావుదురుగాక!’ యని యక్కమలపత్త్ర పుటికల నీ ళ్ళిమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున. 180
క. ఖలుఁ డై ధృతరాష్ట్రుఁడు పు | త్త్రులుఁ దానును గూడి మమ్ము దూరస్థులఁ గా
నిలు వెలువరించి లాక్షా | నిలయంబున నునిచెఁ బాపనిష్ఠితబుద్ధిన్‌.
181
క. కులపాంసను లై యహితం | బులు సేయుచునుండుచుట్టములఁ బొందక యి
మ్ముల నుండువాఁడ పుణ్యుఁడు, | వెలయఁగ గ్రామస్థితైకవృక్షమపోలెన్‌.
182
క. పరహితఫలవంతులు సు | స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర
స్పరసంశ్రయమున జీవిం | తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్‌.
183
వ. అని ధృతరాష్ట్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు, వీరల మేల్కొనునంతకు నే నిచ్చోట నేమరకుండవలయు నని. 184
క. ఆ కాననాంతరంబునఁ | బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర
ప్రాకారుఁడు జాగరమున | శోకమనస్కుఁ డయి పవనసూనుం డుండెన్‌.
185
వ. తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబుఁ డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్గి ‘నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింప గంటి’ నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి ట్లనియె. 186
ఉ. ఇందుల కిమ్మెయిన్‌ మనుజు లెన్నఁడు వత్తురె? వత్తురేని యా
నందముఁ బొంది నిర్భయమునన్‌ శయనింతురె? యిట్లు వంటయిల్‌
కుందెలు సొచ్చె; వేగ చని కోమలి! వారలఁ జంపి తెచ్చి నా
కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్‌.
187
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )