ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
హిడింబ భీమసేనునిం జూచి మోహించుట (సం. 1-139-1)
వ. అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందఱ వారల డాయ శంకించి, యొక్క వృక్షంబు మఱువునం గొండొక ప్రొ ద్దుండి. 188
మ. వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షఃస్థలున్‌ సింహసం
హననుం బాండవసింహమున్‌ హృదయజన్మాకారు నుద్యన్మహా
శనికల్పస్థిరబాహుఁ జూచుచు మనోజాతాగ్నిసంజాతవే
దన యై రాక్షసి కామరూపధర మర్త్యస్త్రీస్వరూపంబుతోన్‌.
189
క. వితత బహురత్నరుచిశో | భితభూషణములు వెలుంగ, బెడఁగగు నవపు
ష్పితజంగమలతక్రియ ను | న్నతకుచ సనుదెంచెఁ బవననందను డాయన్‌.
190
క. రమణి నిజభ్రాతృనియో | గముఁ దలఁపక యపుడు భీముఁ గదిసెఁ; బతిస్నే
హమ కామినులకు బలవం | తము; పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే?
191
వ. ఇట్లు మన్మథవ్యధాశిథిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమాన పూర్వకంబున ‘నీ వెందులదాన? వింతప్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ’ మ్మనిన విని హిడింబ యి ట్లనియె. 192
క. జననుత! యేను హిడింబుం | డను రక్కసుచెలియలం బ్రియంబున నినుఁ జూ
చినయప్పటఁగోలెను గడు | మనోభవనిపీడ్యమానమానస నయితిన్‌.
193
క. నాకుఁ బతి వయిన నిన్నుం | జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్‌;
నాకు మఱి నీవ పతివి గు | ణాకర యి జ్జన్మమున మహాస్నేహమునన్‌.
194
చ. ఉఱఁడు సురేంద్రు నైన బలియుండు హిడింబుఁడు వానిబారికిన్‌
వెఱవనివారలుం గలరె? వీరలు ముంద రెఱుంగ రక్కటా!
యెఱిఁగిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చ కే
మఱి శయనింతురే; కడుఁ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై.
195
వ. ‘ఇది హిడింబువనంబు; దీనం జొచ్చి వెలువడుట జముకుత్తుకఁ జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు; వీరితోడి దేమి; నీవు నాకుఁ బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; నీ కిష్టం బైన చోటికి నిన్నుఁ దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె. 196
క. విను బేల! యెట్టికష్టుఁడుఁ | దన పురుష గుణంబు పెడఁగఁ దల్లిని దోఁబు
ట్టినవారి విడిచి రాగం | బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా.
197
వ. అనిన విని హిడింబ వీరి ‘నందఱ రక్షించుట నీకుఁ బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి నెత్తుకొని పోయెద; వీరలఁ బ్రబోధింపు’ మనిన భీముం డి ట్లనియె. 198
తే. అధికవీరుండు రక్కసుఁ డరుగుదెంచు | నని మనంబున భయమంది వనజనేత్ర!
వీరిసుఖసుప్తులై యున్నవారి నిద్ర | సెడఁగ బోధింప నోప; నాకడిమి వినుము.
199
ఉ. క్రచ్చఱ నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నొక్కటై
వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁజేసి వారలన్‌
వ్రచ్చి వధింతుఁగాక; యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట
న్మెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనెర్తునే.
200
వ. ‘పెక్కులు వలుకక యారక్కసురాఁ బనుపు’ మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి. 201
సీ. కాలమేఘంబునుబోలె విశాల మై | నీల మై దేహంబు గ్రాలుచుండ
ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంష్ట్రలు | మెఱవంగఁ బండులుఁ గొఱికి పెలుచ
నతిరోషలోహితాయతవృత్తనేత్రముల్‌ | దిరుగంగఁ బెట్టుచుఁ బరుషకేశ
జాలంబు గాడ్పునఁ దూలంగఁ గాలోప | మానుఁ డై చనుదెంచి మానుషాదుఁ.
 
ఆ. డనుజఁ జూచి ‘కష్టమనుజులఁ గూడి నా | పనుపు సేయకుండఁ జనునె నీకు?’
ననుచు నుదరిపలుక విని హిడింబయుఁ గడు | వెఱచి భీమసేను మఱువు సొచ్చె.
202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )