ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీమసేనహిడింబాసురుల యుద్ధము (సం. 1-141-15)
వ. అంత. 203
ఉ. పన్నగవైరి విక్రముఁడు పాండవ సింహము దానిఁ జూచి ‘మీ
యన్నను నన్నుఁ జూడుము భయంపడకుండుమ’ యంచు, వాని న
త్యున్నతిఁ దాఁకి ‘రాక్షస! వధోచిత! నీ బల గర్వ మేదఁగా
నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసెద నిర్భయంబుగన్‌’.
204
క. ‘చక్క నగు’ మనిన రక్కసుఁ | డక్కజముగఁ బెరిఁగి ‘యియ్యయగు నిప్పుడు, నీ
యుక్కును బీరముఁ జూచెదఁ | జిక్కక నిలు’ మనుచుఁ గడు విజృంభించి వడిన్‌.
205
క. చే సమరికొంచుఁ బొడువఁగ | డాసినఁ దద్భుజముతోన డగ్గఱఁగ జయో
ద్భాసి యయి పట్టికొనియె మ | హాసత్త్వుఁడు భీమసేనుఁ డమ్మనుజాదున్‌.
206
క. ‘నిరుపద్రవసుఖనిద్రా | నిరతాత్మకు లయిన వీరినిద్రకు నస్మ
చ్చరణభుజఘాతశబ్దం | బరుదుగ విఘ్నంబు సేయు’ నని వగచి మదిన్‌.
207
క. వడముడి యారక్కసు న | య్యెడ కష్టధనుఃప్రమాణ మెడ గలుగఁగ నె
వ్వడి నీడ్చె నల్పమృగమును | విడువక గజవైరి యీడ్చువిధమునఁ బెలుచన్‌.
208
వ. అట్టియెడ. 209
చ. చరణహతిన్‌ మహాతరులు సాల్వడి జర్జరితంబు లై మహిం
దొరఁగఁగ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషష్టిహాయన
ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ధ ము
ద్ధురబలు లై సమీరణసుతుండు హిడింబుఁడు తద్వనంబునన్‌.
210
క. భూరిపదఘాతజాత ధ |రారేణుప్రకరధూసరశరీరకు లై
వా రిద్దఱు నొప్పిరి నీ | హారచ్ఛన్నంబు లయిన యద్రులపోలెన్‌.
211
క. ఆరాక్షసుండు భీము న | పారభుజాబంధనమున బంధించి మహా
ధీరధ్వని రోదోంతర| పూరిత మగునట్లు గాఁగ బొబ్బిడి యార్చెన్‌.
212
వ. అమ్మహాధ్వని విని కుంతియుఁ గొడుకులును మేల్కని, తమసమీపంబున నతిమానుషం బయిన రూప సౌందర్యములతో నున్న హిడింబం జూచి, ‘యిది వనదేవతయో సురకన్యయో’ యనుచు విస్మయంబంది; రంతం గుంతి శాంతవచనంబుల ‘నీ వెందులదాన? విట కేల వచ్చి?’ తని యడిగిన నది యి ట్లనియె. 213
సీ. నీలజీమూతంబులీల నాక్షేపించి | నల్ల నై తోతెంచు నల్లగృహము
గల హిడింబుం డను బలితంపురక్కసు | చెలియల; నాతండు వెలయ మీకు
రోయక యహితంబు సేయ నన్‌ బంచినఁ | జనుదెంచి, యేను మీ తనయునందుఁ
బతిబుద్ధిఁ దాల్చి యుద్ధతమన్మథార్త నై | మసలితి; మసలిన నసుర వచ్చి.
 
తే. యలిగి, మీతోడ నన్నును గలయఁ బట్టి | మ్రింగ నున్న నయ్యసురతోడం గడంగి
మల్లయుద్ధంబు సేయుచు నల్లచోట | నున్నవాఁడు మీసుతుఁడు దర్పోన్నతుండు.
214
వ. ‘నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పుడు చంపుం జూడుం’ డనిన నందఱు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబు సేయుచున్న భీమహిడింబులం జూచి; రంత నచ్చోటికిం జని యర్జునుండు భీమసేనున కి ట్లనియె. 215
ఉ. తూ ర్పరుణంబుగాఁ దొడఁగె దుష్టనిశాచరవేళ యయ్యెడున్‌
మార్పుము కాలయాపన మమర్పక యప్పిశితాశిఁ బట్టి పా
లార్పఁగ నేల నావుడు బలాఢ్యుఁడు భీముఁడు మల్లవిద్య నే
ర్పేర్పడఁగా హిడింబు బలహీనపరాక్రముఁ జేన్‌సెఁ జెచ్చెరన్‌.
216
క. వడి నసురవాత ముక్కున | నుడుగక రక్తప్రవాహ మొలుకుచు నుండన్‌
గడకాలు వట్టి వానిని | మడవక పవనజుఁడు నూఱు మాఱులు వీచెన్‌.
217
ఆ. లావు సెడఁగ నిట్లు వీవంగఁ బడి గత | చేష్టుఁ డయిన యసురఁ జిక్కఁ బట్టి
నేలఁ బెట్టి వాని కోలెమ్ము బ్రల్లన | విఱిచి నడుము ద్రుంచి వీచి వైచె.
218
వ. అట్టి చిత్ర వధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందఱు హిడింబానుగమ్యమాను లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక ‘రాక్షసులు వైరంబుఁ దలంచి మాయలు సేయుదురు కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న వోయిన తెరువున పొ’ మ్మనిన నది భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్ద్రచిత్తుం డయి ధర్మరాజు భీమున కి ట్లనియె. 219
తే. వధకు నర్హుఁడై వచ్చినవానిఁ జంపి | తదియు ధర్మువ; యిది చాల నబల; దీని
కలుగఁ జన; దాత్మరక్షకు నగ్గలంబు | ధర్మరక్షయ యుత్తమధార్మికులకు.
220
క. ఆపద యైనను ధర్మువ | ప్రాపుగ రక్షింపవలయుఁ బరమార్థము; ధ
ర్మాపాయమ ధార్మికులకు | నాపద జన్మాంతరమున ననుగత మగుటన్‌.
221
వ. ‘దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు’ ననిన హిడింబ ధర్మరాజునకుం గుంతీదేవికి మ్రొక్కి యేకాంతంబునఁ గుంతి కి ట్లనియె; ‘నవ్వా! సర్వప్రాణులకు సామాన్యం బయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినాఁ డిప్పుడ ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ మి మ్మందఱ నెత్తికొని మీమెచ్చినచోటికిఁ బోవనేర్తు; నాపలుకులు నమ్ము నది; యే నతీతానాగతవర్తమానంబు లెల్లను దెల్లంబుగా నెఱుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు; ముందట నొక్క సరోవరంబును నొక్కవనస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నాఁకలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్న మీ కడకుఁ గృష్ణద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు సేయు నని చెప్పిన. 222
క. విని కుంతియుఁ బాండవులును | మనమున విస్మయముపడి సమంజసభావం
బున దాని దివ్యవనితయ | యని తద్దయు నాదరించి రప్పుడు కరుణన్‌.
223
వ. అంత దాని వినయంబునకు ననాగతం బెఱుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె. 224
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )