ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీముఁడు తల్లియనుమతంబున హిడింబను బరిగ్రహించుట (సం. 1-143-1)
క. అన్న! యిది ధర్ము వని మీ | యన్నను నన్నును నతిప్రియంబున నెదలో
మన్నించి, యేమి వనిచినఁ | గ్రన్నన మా పసుపు సేయఁ గడఁగుము బుద్ధిన్‌.
225
క. ఇది పరమ సాధ్వి, దీనిని | మది నొండుగఁ దలఁప వలదు, మానుగఁ బుత్త్రా
భ్యుదయ మగుఁ; బాండుహితముగ | నిది కార్యం బని పరిగ్రహింపుము నెమ్మిన్‌.
226
వ. అని భీమసేను నొడంబఱచి హిడింబ కనురాగంబుగాఁ జెప్పి ‘నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము; పగ ళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది’ యని నియమించిన భీముండును ‘బుత్త్రజన్మం బగునంతకు దీని మీవచనంబునఁ బరిగ్రహించెద’ నని వారల సమక్షంబున సమయంబు సేసె; నంతఁ బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనఁ గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి; శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసు లై సుఖం బున్నంత. 227
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )