ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
పాండవులకు వ్యాసుఁడు హితోపదేశము సేయుట (సం. 1-144-7)
ఉ. పుణ్యతపోమయుండు మునిపూజ్యుఁడు బ్రహ్మసమప్రభుండు బ్ర
హ్మణ్యుఁడు ప్రావృషేణ్యజలదాసితవర్ణుఁ డశేషకిల్బిషా
రణ్యద వానలుం డగు పరాశరనందనుఁ డేగుదెంచెఁ ద
త్పుణ్యచయస్వరూపమునుబోలెఁ గరంబు మనోముదంబుగన్‌.
228
వ. ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీంద్రునకు నందఱు నతిభక్తి నమస్కరించి యాస నార్ఘ్యాది విధులం బూజించి యున్నవారలం గరుణార్ద్రదృష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె. 229
పద్మకము. కొడుకు పల్కు విని కూడదు నాక దుర్మాతుఁడై
కడఁగి మీకు నపకారము సేసి ధరిత్రి వె
ల్వడఁగఁబంచెఁ గడుఁబాపమతిన్‌ ధృతరాష్ట్రుఁ, డె
య్యెడల దుర్జనుల నేమఱి నమ్మగఁ బోలునే.
230
వ. ‘దీని నెఱింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయి వినీతుల రయిన మీకు బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబువలన రక్షించు; నిం దొరు లెఱుంగకుండఁ గార్యార్థుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేఁగి బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్ఠి నుండి నారాక ప్రతీక్షించియుండు నది’ యని కఱపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌఁగలించుకొని, బాష్పపూరితనయన యయి మ్రొక్కియున్న కోడలి నూరార్చి; ‘నీకొడుకు ధర్మనిత్యుం; డీ యుధిష్ఠిరుండు నారాయణుభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం గురుకులంబునెల్లఁ బవిత్రంబు సేయు’ నని శోకోపశమనంబుఁ జేసి; హిడింబం జూచి ‘దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశవర్తి యయి పరిచరించి మహాసత్త్వుం డయిన కొడుకుం గాంచు; నాతండు మి మ్మందఱ నాపద్విషయంబున నుద్ధరించు’ నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన. 231
క. అమ్మునివరు కఱపిన మా | ర్గమ్మునఁ బాండవులు విగతకల్మషు లవిషా
దమ్మున సుఖముండిరి విన | య మ్మొప్పఁగ శాలిహోత్రునాశ్రమభూమిన్‌.
232
వ. అంత. 233
చ. పవనతనూజుఁ డక్కమలపాలికచేత వినీతుఁ డై మహా
ర్ణవవృతభూమిలోఁ గల వనంబుల హంసబలాకసారసా
రవరుచిరాపగావరసరఃపులినంబులఁ బర్వతంబులన్‌
వివిధవిహారుఁ డై యనుభవించె నభీష్టమనోజభోగముల్‌.
234
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )