ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట (సం. 1-143-27)
చ. నరవరుఁడైన భీమువలనం బ్రభవించె హిడింబకున్‌ సుతుం
డురుతర భీమ రూపుఁడు ఘటోత్కచ నాముఁడు విస్ఫుర ద్భయం
కర వదనంబు శంకునిభకర్ణములున్‌ వికృతాక్షులుం బయో
ధరవరవర్ణమున్‌ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండఁగన్‌.
235
వ. ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకుఁ గుంతీదేవికి మ్రొక్కిన, నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్నిదినంబు లుండి; యొక్కనాఁ డంజలి పుటఘటితమస్తకుం డయి ‘రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం; బని గలయప్పుడు నన్నుఁ దలఁచునది; యాక్షణంబ వత్తు’ నని యందఱిచేత ననుజ్ఞాతుండై తల్లిం దోడ్కొని, యుత్తరాభిముఖుం డయి యరిగె; నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్స్య త్రిగర్తకీచక విషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని. 236
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )