ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
పాండవు లేకచక్రపురంబున విప్రగృహంబున నుండుట (సం. 1-145-1)
క. లలితజటాజినకుశవ | ల్కలధరు లై వేద మొప్పఁగాఁ జదువుచు ని
మ్ముల బ్రహ్మచారివృత్తిని | వెలయఁగ నం దుండి రొక్కవిప్రగృహమునన్‌.
237
క. ధృతిఁ జదువుచు భిక్షార్థము | ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌన
వ్రతులం దృప్తులఁ జేసిరి | సతతము నందుల గృహస్థ సద్ద్విజులు దయన్‌.
238
క. ‘జలజప్రియతేజుల వీ | రల ధీరుల ధరణివలయరాజ్యశ్రీయో
గ్యుల ని ట్లేలొకొ భిక్షా | శులఁ జేసె విధాతృఁ’ డంచు శోకింప జనుల్‌.
239
క. పరమాన్నభక్ష్యభిక్షా | పరిపూర్ణతరంబు లయిన పాత్రము లయ్యే
వురు నిత్యంబు నివేదిం | తురు దల్లికిఁ గరముభక్తితో వినయమునన్‌.
240
వ. కుంతియు దాని రెండుభాగంబులు సేసి యం దొక్క భాగంబు భీమునకుం బెట్టి, తక్కిన భాగంబు గడమ కొడుకులుం దానును గుడుచుచు నిట్లు ప్రచ్ఛన్ను లై యేకచక్రపురంబున నున్నంత, నొక్కనాఁడు ధర్మార్జునయములు భిక్షార్థం బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత, నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కి ట్లనియె. 241
తే. ఇందు సుఖ ముండితిమి యొరు లెఱుఁగకుండ | నేలొకో యిప్పు డీ విప్రు నింట నార్త
రవము వీతెంచె? దీని నారసి యెఱుంగ | వలయుఁ; దత్ప్రతీకారంబు వలయుఁ జేయ.
242
వ. పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్పు డెద్ది యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం బీ గృహస్థున కయ్యెం గావలయు; నా మనంబు మలమల మఱిఁగెడుఁ గావున దీనిం దలఁగి వీరికి మనఃప్రియంబు సేయవలయు. 243
క. కృత మెఱుఁగుట పుణ్యము; స | న్మతి దానికి సమముసేఁత మధ్యము; మఱి త
త్కృతమున కగ్గలముగ స | త్కృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్‌.
244
వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 245
వ. ఎఱిఁగి నాకుఁ జెప్పు; మిది యేమి? యెవ్వరి | వలన నింతయయ్యె? వగవ నేల?
యెంత కడిఁది యైన నిది యేను దీర్చి యీ | విప్రునకుఁ బ్రియంబు విస్తరింతు.
246
వ. అనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )