ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
బకున కాహారముగాఁ బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము విచారించుట (సం. 1-145-20)
క. నలసారము సంసార మ | ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం
చలము పరాధీనం బిం | దుల జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్‌.
248
క. ఆదిని సంయోగవియో | గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం
పాదిల్లక తక్కవు పూ | ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్‌.
249
తరువోజ. ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున నిబ్బారిఁ గడవఁ
గానేర్తు? మెయ్యది గర్జ? మిందుండఁ గా దేగుదమ యొండు గడ కని ముంద
రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది; యిట్టిదారుణ మిమ్మెయిఁ జేయఁ
గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ? గర్మవిపాకంబు గడవంగ లావె.
250
సీ. మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై | ధర్మచారిణి యగు దాని వినయ
వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు | భక్ష్యంబ వగు మని పనుపనేర్తు?
ధర్మాభివృద్ధిగాఁ దగు వరునకు నీగ | నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన
యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు | దౌహిత్రలాభంబు దలుఁగ నెట్లు
 
ఆ. దీనిఁ బుత్తు? మఱి మదీయ పిండోదక | నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు
వానిఁ బితృగణంబువలని ఋణంబుఁ బా | చిన మహోపకారిఁ జిఱుతవాని.
251
ఆ. ఎట్టు సూచి చూచి యిది పాప మనక య | య్యసుర వాతఁ ద్రోతు నదయవృత్తి;
నరిగి యేన యిప్పు డసురకు నాహార | మగుదు వీరిఁ బుచ్చ నగునె నాకు.
252
వ. అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253
క. మనుజులకు నెవ్విధంబున | ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపఁగ జన | దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్‌.
254
వ. ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండుఁడు; భార్యయందుఁ బడయంబడు నపత్యంబు నాయందు మున్న పడసితి; రేనును ఋణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు; మఱి యట్లుంగాక. 255
ఆ. పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన | సతియ నోఁచినదియు సతులలోనఁ;
బురుషహీన యైనఁ బరమపతివ్రత | యయ్యు జగముచేతఁ బ్రయ్యఁబడదె.
256
ఆ. పడిన యామిషంబు పక్షు లపేక్షించు | నట్లు పురుషహీనయయిన యువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు | రిదియుఁ బాప మనక హీనమతులు.
257
ఆ. సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార | సంగ్రహంబు సేఁత శాస్త్రమతము;
పతి విముక్తుఁ డయిన సతి కన్యపురుషసం | గ్రహముసేఁత లోకగర్హితంబు.
258
వ. ‘కావున నేను భవద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని క్కుమారుల రక్షింపనేర; నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసదృశులు గానివా రిక్కన్యం బ్రార్థించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్పరోక్షంబునం బునర్దార పరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది | యనుచు మరణవ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె. 259
ఆ. ఒలసి యెంతకాల ముండిన నేను మీ | దానఁ గాన, యొరుల ధనమ; నన్ను
నెన్నఁడయిన నొరుల కిచ్చుచో నసురకు | భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ.
260
తే. తండ్రిచేయు తిలోదక దాన విధులు | పొందుఁ బరలోకగత యైన పుత్త్రియందుఁ;
బుత్త్రి చేసిన విధులు దత్పురుషుఁ గాని | తల్లిదండ్రులఁ బొందవు ధర్మయుక్తి.
261
వ. ‘మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీ రిద్దఱు జీవించిన ననేక పుత్త్ర పౌత్త్ర లాభం బగు; దానంజేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం’ డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు. 262
తే. బాలకుం డొక కొండుక కోల చేతఁ | బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి
చులుక వత్తు మీ రేడ్వఁగా వలవ, దనుచుఁ | గలయ నూరార్చెఁ దన తొక్కుఁబలుకు లొప్పు.
263
వ. వాని యవ్యక్తవచనంబులు విని యందఱు నే డ్పుడిగిన, నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి. 264
క. ‘ఇది యేమి తెఱఁగు? దీనికి | మొద లెయ్యది నాకుఁ దెల్లముగఁ జెప్పుఁడు తీ
ర్చెద’ నని విగతాసులఁ దన | మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్‌.
265
వ. ఇ ట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డి ట్లనియె. 266
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )