ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కుంతీదేవికి బ్రాహ్మణుండు తనదుఃఖకారణంబును దెలుపుట (సం. 1-148-1)
సీ. ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని | మానుషంబునఁ దీర్పరాని దాని;
నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ | ప్రోలికి నామడనేల నల్ల
యమునానదీగహ్వరమున బకుం డను | రక్కసుం డుండి వాఁ డక్కజముగ
నిందుల కాఁపుల నందఱఁ దొల్లి యి | ల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు
 
ఆ. లగు ధరామరేంద్రు లగణితజపహోమ | దానవిధులఁ జేసి వానివలనఁ
గ్రమము వడసి యొక్క సమయంబుఁ జేసిరి; | యొనర దాని తెఱఁగు వినుము తల్లి!
267
వ. నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెం డెనుపోతులం బూన్చిన శకటంబున నపరిమితభక్ష్యపిశిత మిశ్రాన్నంబు నించికొని పోయిన దానిని, వానిని, నయ్యెనుపోతులను భక్షించుచు. 268
ఆ. మనుజభక్షుఁ డిదియ తనకు నప్పనముగా | నొరులవలనిబాధ నొరయకుండ
దీనిఁ గాచుచుండు నీనాఁటిరాజును | దలఁపఁ డసుర నోర్వ బలిమిలేమి.
269
ఉ. పోలఁగ ధర్మశీలుఁ డయి భూరిబలాధికుఁ డైన ధారుణీ
పాలకు రక్ష ము న్వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో
నోలిన మేలుగాఁ బడసి యూళ్ళను నున్నది యట్లుగాని నాఁ
డేల గృహస్థవృత్తి సుఖ మేఁగి వనంబున నున్కి కష్టమే.
270
క. అరి యని విప్రులచేతను | ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె
వ్వరు నిప్పాపుఁడు మానిసి | నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్‌.
271
వ. ‘పెద్దకాలంబునకు నీ యిలువరుస నేఁడు మాకు వచ్చె; ని చ్చిఱుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప; నేన పోయెద’ నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యి ట్లనియె; ‘నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద దలఁగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వాఁడును గడుబాలుండు; బలిగొనపోవ నర్హుండు గాఁడు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొని పోయెడు’ ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె. 272
మధ్యాక్కర. అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్‌ జీవితార్థి నై నాకు
హితముగా రక్కసువాతఁ ద్రోవ నే నె ట్లొడంబడుదు?
మతి నవమానింపఁగా దనిన విప్రుమరణంబు దలఁచు
టతిపాతకము; పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద.
273
క. ధృతి సెడి వేఁడెడువానిని | నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు | ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్‌.
274
వ. ‘మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోప’ ననినఁ గుంతి యి ట్లనియె. 275
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )