ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
బకునిఁ జంప భీమునిఁ బంపుటకుఁ గుంతి నిశ్చయించుట (సం. 1-149-13)
క. ఏనును దీనిన తలఁచి మ | హీనుత! విప్రవధ యెద సహింపక మఱి నా
సూను సమర్పించితి; మ | త్సూను వధింపంగ రక్కసునకు వశంబే?
276
క. ఖలు నసుర నోర్వ నోపెడు | బలయుతుఁగా నెఱిఁగి కొడుకుఁ బనిచెదఁ గా; కి
మ్ముల శతపుత్త్రులు గల ధ | న్యుల కైన ననిష్టుఁ డగు తనూజుఁడు గలఁడే ?
277
వ. ‘ఈతనిచేతఁ దొల్లియుఁ బెక్కం డ్రసురులు నిహతు లయిరి’ వీఁడు మహాబలసంపన్నుండు మంత్రసిద్ధుం; డని భీముం బిలిచి ‘యీ బ్రాహ్మణునాపదం దలఁగి నాకు మనఃప్రియంబు సేయు’ మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంప బూనె; బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె; నంత ధర్మార్జుననకుల సహదేవులు వచ్చి పరమహర్ష పరిపూర్ణుండై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్మితు లగుచుండ ధర్మతనయుం డల్లనఁ దల్లికి ని ట్లనియె. 278
చ. నరనుతకీర్తి యీ యనిలనందనుఁ డెవ్వరితోడనేని భీ
కరసమరంబు సేయ సమకట్టినయట్లు మహానురాగ ని
ర్భరమున నున్నవాఁ; డితనిభావము సూడఁగ వేఱు; వీని సు
స్థిరబలు మీరు పంచితిరొ? చెచ్చెరఁ దాన యుపక్రమించెనో?
279
వ. అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి ‘యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయుఁ దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు, దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగాఁ దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి ‘యిది యేమి సాహసంబు సేసితి? రొడ్లకొడుకులకుంగాఁ దమకొడుకుల విడుచు దుర్బుద్ధులునుం గలరె; యిది లోకాచారవిరుద్ధంబు; మఱి భీమసేనుఁడు మీకు విడువందగియెడు కొడుకే’? 280
సీ. ఇతని విక్రమ మాశ్రయించియ కాదె య | య్యెడ లక్కయిల్లు వెల్వడఁగఁ గంటి;
మడవిలో నిద్రావశాత్ముల మై యున్న | మననిద్రఁ జెఱుపఁగా దని హిడింబు
నెడగల్గఁ గొనిపోయి యెక్కటి సంపిన | దండితశత్రుఁ డీతండ కాఁడె!
యితనిబల్మిన కాదె యెంతయు భీతు లై | ధృతరాష్ట్రనందనుల్‌ ధృతియుఁ దఱిఁగి
 
ఆ. నిద్రలేక తమకు నిలుచు నుపాయంబు | లొండుదక్కి వెదకుచున్నవారు;
బలియు నిట్టిభీము బ్రాహ్మణార్థమ్ముగా | నసురవాతఁ ద్రోతు రవ్వ! యిట్లు.
281
వ. ‘అక్కట! దుఃఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి?’ యనినఁ గొడుకునకుఁ గుంతి యి ట్లనియె. 282
ఆ. భ్రమవిమోహలోభభయపరిభూత నై | కొడుకు విడువ నంత వెడఁగ నయ్య!
యేను భీముశక్తి యెఱుఁగక పంచిన | దానఁ గాను; వినుము వీనిశక్తి.
283
తే. వీఁడు పుట్టిన పదియగునాఁడు పెలుచఁ | బడియె నాచేతనుండి య ప్పర్వతమునఁ;
బడినవడిఁ జేసి బాలకు నొడలు దాఁకి | యచటి రాలెల్లఁ బెల్లు ను గ్గయ్యెఁ జూవె.
284
వ. అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్థుండు; రక్కసు నశ్రమంబునం జంపి యిందుల బ్రాహ్మణులబాధ యుడుచుం; బవనతనయు నుద్దేశించి సంతాపింపవలవదు; మనకు సుఖనివాసంబు సేసి పరమోపకారి యైన యీబ్రాహ్మణునకుఁ బ్రత్యుపకారంబు సేయ సమకూరె. 285
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )