ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కుంతి ధర్మజునకుఁ బరదుఃఖనివారణము పరమపుణ్యం బని తెలుపుట (సం. 1-150-20)
సీ. ఉత్తమక్షత్త్రియుం డొరులదుఃఖంబులు | దలఁగంగఁ బుట్టిన ధర్మశీలుఁ;
డలయక మృత్యుభయం బైనచో విప్రుఁ | గాచి సత్పుణ్యలోకములు వడయు;
ధన్యుఁడై క్షత్త్రియు దయఁ గాచి బుధలోక | కీర్తనీయంబగు కీర్తి వడయు;
వైశ్యశూద్రులఁ గాచి వసుధాతలస్థిత | సర్వప్రజానురంజనము వడయు;
 
ఆ. ననఘ! సన్మునీంద్రుఁ డయిన వేదవ్యాసు | వలన దీని నిక్కువముగ వింటి;
బ్రాహ్మణులకుఁ బ్రియము పాయక చేయంగఁ | గాన్ప చూవె పుణ్యకర్మఫలము.
286
క. జననుత! బ్రాహ్మణకార్యము | సనఁ జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ
కును నీతమ్ములకును నగు | ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్‌.
287
వ. అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్ధికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను నియోగించె; నంత భీముం డవ్విప్రున కి ట్లనియె. 288
ఆ. కడుపునిండఁ గుడువఁ గానమి రేయెల్లఁ | గన్నువొందకున్నఁ గరము డస్సి
యున్నవాఁడ; నాకు నోపుదురేని యా | హారతృప్తిసేయుఁ; డట్టు లయిన.
289
ఆ. ‘బలము పెద్ద గలిగి పాపిష్ఠు రక్కసుఁ | జంపి యిప్పురమున జనుల కెల్ల
హర్ష మే నొనర్తు’ ననవుడు విప్రుఁడు | దానుఁ జుట్టములును దత్‌క్షణంబ.
290
తరలము. పలుదెఱంగుల పిండివంటలుఁ బప్పుఁ గూడును నేతికుం
డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ
నలఘుసత్త్వుఁడు మారుతాత్మజుఁ డన్నిటన్‌ గతఖేదుఁడై
బలము గల్గి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయఁగన్‌.
291
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )