ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీముఁడు బకాసురునిఁ జంపఁబోవుట (సం. 1-151-1)
వ. ఇట్లు భీమసేనుం డిష్టాన్నోపభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుం డయి బకాసురుం డున్నచోటికిం జని యార్ద్రశుష్కకళేబరదుర్గంధనిందితం బయిన బకస్థానంబు డాయక యెడగలిగి యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని కాళ్లుసేతులుఁ గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె; నటబకాసురుండును. 292
ఆ. ‘ప్రొద్దు నేఁడు పెద్దపోయె నిత్యము నిట | తెచ్చియిచ్చుబలియుఁ దెచ్చి యీఁగ
నొల్ల కెలుఁగు లిచ్చుచున్నవాఁ డమ్మను | జాధముండు మెచ్యఁ డయ్యె’ ననుచు.
293
ఆ. అలిగి యౌడుగఱచి యాఁకటి పెలుచన | నిలువనోప కసుర నింగి దాఁకఁ
బెరిఁగి యరుగుదెంచె భీమరూపంబుతో | నుగ్రభంగి భీముఁ డున్న దెసకు.
294
సీ. చనుదెంచి ముందట శకటంబుపైనుండి | యోడక కుడుచుచు నున్న భీము
దవ్వులఁ జూచి ‘నిత్యము నాకు నియమించి | కొనివచ్చు కూ డేల కుడిచె దీవు?
గడుఁ గ్రొవ్వి, రేకచక్రంబునవారల | కే నింత యెల్లిద మేల యైతి?’
నని డాయ వచ్చి యయ్యనిలనందనువీఁపుఁ | బిడికిటఁ బొడిచిన, బెదర కసుర
 
ఆ. వలను సూడ కొండు వగవక యెప్పటి | యట్లు కుడుచుచున్న నలిగి బకుఁడు
‘వీని బాగు సూడ వే’ ఱంచు డాసిన | తరువుఁ బెఱికి కొనుచుఁ దాఁకుఁ దెంచె.
295
వ. అంతకు ముందఱ భీమసేనుం డంత కూడునుం గుడిచి యనంతబలసమేతుం డై యంతకాకారంబున మల్లసఱచుకొని యార్చుచు. 296
ఉ. ఇంచుకయేని పాపమున కెన్నఁడు రోయక యెల్లవారి బా
ధించి మనుష్యమాంసములు దించును గ్రొవ్వితి; వాని నెల్లఁ గ్ర
క్కించెద, నీమదాంధ్య ముడిగించెద, నిప్పుడ కాలుప్రోలి కే
గించెదఁ జక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా!
297
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )