ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీమసేనుఁడు బకాసురుం జంపుట (సం. 1-151-15)
వ. అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు పెఱికికొని రక్కసునిపై వైచిన వాఁడును దన చేతివృక్షంబున దాని భగ్నంబుఁ జేసె; ని ట్లిరువురు నొక్కవడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు సమసిన మల్లయుద్ధసన్నద్ధులై. 298
చ. పరువడి నొండొరుం బెనఁగి పట్టుచుఁ ద్రోచుచు నీడ్చుచుం బర
స్పరజయకాంక్షులైన బక పాండవవీరుల పాదఘట్టనన్‌
ధరణితలంబు గ్రక్కదలెఁ, దన్నికటద్రుమవల్లు లెల్ల జ
ర్జరితము లయ్యె, నిష్ఠురవిశాలశిలల్‌ నుఱుమయ్యె నయ్యెడన్‌.
299
ఉ. ఇద్దఱ హుంకృతిధ్వనులు నిద్దఱ భూరిభుజారవంబు న
య్యిద్దఱముష్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న
య్యిద్దఱపాదఘట్టితమహీరవమున్‌ విని చూప ఱెల్లనుం
దద్దయు భీతి నచ్చటికిఁ దా రెడగల్గఁగఁ బాఱి రొక్కఁడై.
300
వ. ఇట్లు భీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్ధంబు సేయునెడ. 301
క. కడఁగి వృకోదరుఁ డసురం | బడఁగా ధర వైచి వామపాదంబునఁ జే
డ్పడ వానిఱొమ్ముఁ దాఁచెం | గడుకొని యసురయును లేచి కడునుద్ధతుఁ డై.
302
క. అనిలసుతుఁ బట్టికొని పె | ల్చన త్రోచి కడంగి కనకశైలనికుంజం
బునుబోని వానివక్షముఁ | దనదృఢతరముష్టిఁ బొడిచెఁ దద్దయు నలుకన్‌.
303
వ. భీముండును వాని హీనసత్త్వుంగా నెఱింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల న మ్మనుజ కంటకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని. 304
ఉ. దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా
కారుఁడు వానివీఁపు విఱుగంబొడిచెం బిశితంబుతో నవ
ద్వారములన్‌ మహారుధిరధారలు బోరన నొల్కి మాంస పం
కారుణవారిఘోరనదు లై పఱవన్‌ విపినాంతరంబునన్‌.
305
వ. ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం డయి విగతజీవితుం డగుచుండి యఱచిన నమ్మహాధ్వని విని, వాని బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పఱతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె. 306
తే. ‘ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము | నట్లు మనుజులఁ దినకుండుఁ; డడరి మనుజ
భక్షణము సేసితిరయేని బకుని యట్లు| చత్తు’ రని రక్కసుల కెల్లఁ జాటె వినఁగ.
307
వ. అంత నారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాఁటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబుఁ చేయనోడి; రట్లు భీముండు బకాసురుం జంపి, వానిం జంపుట జగద్విదితంబుగాఁ దత్కళేబరం బీడ్చుకొని వచ్చి, నగర ద్వార సమీపంబున వైచి, యందుల విప్రులకు సంతోషంబు సేసి, నిజ నివాసంబునకుం జని త ద్వృత్తాంతం బంతయుఁ దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత. 308
ఉ. వీఁ డొక మంత్రసిద్ధుఁ డగు విప్రుఁ; డసాధ్యబలున్‌ బకాసురున్‌
నేఁ డనిఁ జంపెనట్టె! యితనిం జని చూతమ యంచుఁ జెచ్చెరం
బోఁడిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చి చూచి ర
వ్వాఁడిమగంటిమిన్‌ వెలయువాని వృకోదరు నెల్లవారలున్‌.
309
క. అని యిట్లు పాండునృపనం | దనుల చరిత్రంబు సెప్పెఁ దా వైశంపా
యనుఁడు జనమేజయున కని | జనవినుతచరిత్రపాత్ర! సౌజన్యనిధీ!
310
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )