ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రౌపదీవివాహప్రయత్నము (అమూలకము)
ఉ. మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్‌.
22
వ. మఱియును. 23
సీ. ‘ఇంద్రసమానున కిందీవరశ్యామ | సుందరాంగున కింద్రనందనునకు
దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁ గాంచితి | నని యున్నచో విధాతృనకు నిట్లు
పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా | ధ్వరమునఁ బుట్టిన సరసిజాక్షి
నే నెట్టు లొరులకు నీ నేర్తు’ నని దుఃఖ | పరవశుఁడయి యున్న ధరణిపతికిఁ
 
ఆ. దత్పురోహితుండు దా నిట్టు లనియె ‘న | ప్పాండవులనుగుఱిచి బహువిధంబు
లగు నిమిత్తములు నయంబునఁ జూచితి; | నెగ్గు లేదు; వారి కెల్ల లగ్గు’.
24
వ. ‘తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం’ బనినం బురోహితువచనంబునంజేసి, యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి. 25
క. ఎవ్వరికిని మోపెట్టను | దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్‌
దవ్వై దివమునఁ దిరిగెడు | నవ్విలసత్కనకమత్స్వ యంత్రముఁ జేసెన్‌.
26
క. ‘ధరణిఁ గల రాజులెల్లను | బురుడునఁ గాంపిల్య నగరమున కరిగెద రొం
డొరులం గడవఁగ, నని భూ | సురువరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథయెల్లన్‌.
27
వ. దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యి ట్లనియె. 28
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )