ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పాండవులు ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట (సం. 1-157-1)
చ. ఉరుసరసీవనంబులు మహోగ్రనగంబులు నేఱులున్‌ సుదు
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్‌ నిరం
తరగతి నేఁగుచుం గనిరి ధర్మసమేతుఁ బితామహుం దమో
హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రుఁ బరాశరాత్మజున్‌.
33
వ. కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందఱు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతః కరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె. 34
క. ధర్మసుతుఁ డున్న చోటను | ధర్మువునకు హాని గలదె ధారుణి; నైనన్‌
ధర్మువ తాత్పర్యముగా | నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై.
35
సీ. తా నొక్క మునికన్య దన కర్మవశమునఁ | బతిఁ బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన | దానికి శివుఁడు ప్రత్యక్షమయ్యు,
‘వేఁడుము వర’ మన్న వేడ్కతోఁ బతిదాన | మని యేనుమాఱు లయ్యబల వేఁడె;
‘నట్లేని నీకు దేహాంతరంబునఁ బతు | లగుదు రేవురు పరమార్థ’ మనియు
 
ఆ. హరుఁడు కరుణ నిచ్చె; నది యిప్డు పాంచాల | పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది; తత్స్వయం | వరము సేయుచున్నవాఁడు నేఁడు.
36
వ. ‘మీరు ద్రుపదపురంబునకుం జక్క నరుగునది; యందు మీకు ల గ్గగు’ నని చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్ళును బయనంబు వోవువా రొక్కనాఁ డర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై, యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుంగా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ, నందఱు నరుగునెడ, నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చిన; వాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి, విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. 37
క. ఇల నర్ధరాత్రమును, సం | ధ్యలు రెండును, భూత యక్ష దానవ గంధ
ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు; | వెలయఁగ నిం దవనిచరులు వెఱతురు నడవన్‌.
38
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )