ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అర్జునుఁ డంగారపర్ణుని జయించుట (1-158-9)
వ. ‘ఇ వ్వేళయందుఁ గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము; నన్ను డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ, గుబేరుసఖుండ; నెప్పుడు నిందు విహరించుచుండుదు; న న్నె ఱుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులు నా జగద్విదితంబులు; దీని మానవులు సొర నోడుదు’ రనిన వాని కర్జునుం డి ట్లనియె. 39
క. నడురేయి సంధ్యలందును | నడవఁగ నోడుదు రశక్తనరు లొరులు; భయం
పడుదుమె యే మెయ్యెడ నె | ప్పుడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్‌.
40
క. అడవులు నేఱులు నివి నీ | పడసిన యవి యట్టె; పుణ్య భాగీరథి యి
ప్పుడమిఁ గల జనుల కెల్లను | నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే?
41
సీ. హైమవతోత్తుంగ హేమశృంగంబున | నుండి భూమికి వచ్చి యుదధిఁ గూడె
గంగనా; మూఁడు దెఱంగుల నదియు; మం | దాకిని నా సత్పథంబునందు
సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న | య్యధమలోకంబునయందు భోగ
వతి యన నొప్పె నున్నతి; నిట్లు త్రిభువన | పావని యైన యిప్పరమమూర్తిఁ
 
ఆ. బార్వతీశమకుటబంధబంధురతరా | వాస గంగ నాడ వచ్చి నీవు
వలవ దనిన నుడుగువారము గాము; నీ | విఘ్నవచనములకు వెఱతు మెట్లు?
42
వ. అనుచు నిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్జునునిపయి నంగారపర్ణుం డతినిశిత సాయకంబు లేసిన, నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిర్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచి కొని వాని కి ట్లనియె. 43
ఆ. వెడఁగ! యిట్టి పాటి వెఱపించుటలును మా | యలును నేమి సేయు నస్త్రవిదులఁ;
బెక్కులయ్యు నీ బిభీషికల్‌ నుఱువులు | విరియునట్టు లిందు విరియుఁ జూవె.
44
సీ. అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, | న్నతఁడు భరద్వాజుఁ డనఁగఁ బరఁగు
ముని కిచ్చె, నమ్మహాముని భార్గవున కిచ్చె | భార్గవుండును గుంభభవున కిచ్చె
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని | య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర
గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ | దద్రథం బప్పుడ దగ్ధ మయిన,
 
ఆ. నగ్నిదాహభీతి నంగారపర్ణుండు | బమ్మరిల్లి నేలఁబడిన, వానిఁ
గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు | కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి.
45
క. వాని మనోవల్లభ కుం | భీనసి యనునది గరంబు భీతి ‘నశేషో
ర్వీనాథులార! దయఁ బతి | దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్‌’.
46
క. అని యఱచుచున్నదానికి | ననఘుఁడు గరుణించి పాండవాగ్రజుఁ డయ్య
ర్జునుఁ జూచి ‘వీని విడువుమ | యని నోడినవాని హీను నపగతశౌర్యున్‌’.
47
ఆ. అనిన నరుఁడు వల్లె యని వాని కనియె ‘గం | ధర్వ! నిన్నుఁ గరుణ ధర్మరాజు
కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు | విడువఁ బనిచె నింక వెఱవకుండు’.
48
వ. అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుండై యర్జునున కంగారుపర్ణుం డి ట్లనియె. 49
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )