ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అంగారపర్ణుం డర్జునునితో సఖ్యము సేయుట (1-158-35)
మ. అని నీచేతఁ బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం
కను దాల్పన్‌ మది నంత నిస్త్రపుఁడనే; గర్వం బడంగన్‌ రణం
బున మున్నోడియుఁ బూర్వనామమున బెంపున్‌ గర్వముం దాల్చువాఁ
డనఘా! సత్సభలందు మెచ్చఁబడునే హాసాస్పదీభూతుఁ డై.
50
వ. నీ యాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రం బైన రథంబు వడసి, యిది మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన యది; నా తపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు పడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె; నాతనివలన నేనుఁ బడసితి; నెవ్వండేని మూఁడులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబును గంజూచు; నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం భైఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ధ నుండవు; మహాపురుషుండవు; నీకు సఫలంబగు, నీదివ్యవిద్యఁ గొను మిచ్చెద; దీనిఁ గొనునప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది; మఱి మహా జవసత్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీ కేవురకుం జెఱు నూఱేసి యిచ్చెద. 51
సీ. వృత్రుపై గీర్వాణవిభుఁ డల్గి వజ్రంబు | వైచిన నది వాని వజ్ర కఠిన
పటు మస్తకంబునఁ బడి పాతరయమునఁ | బదివ్రయ్యలైనఁ దద్భాగచయము
క్రమమున బ్రాహ్మణ క్షత్ర విట్ఛూద్రుల | యందు వేదంబులు నాయుధములు
హలము శుశ్రూషయు నయ్యె వజ్రంబులు | వాహంబులందు జవంబు నయ్యె
 
తే. నట్టి జవమున నభిమతం బగుచు నున్న | యట్టి హయసమూహం బయ్యె నవనిపతుల
కఖిల భువనముల్‌ రక్షించునపుడు సకల | సాధనములలో నుత్తమసాధనంబు.
52
వ. అనిన వాని కర్జునుం డి ట్లనియె. 53
ఆ. ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే | విద్యయును జయంబు విత్తచయము
గొనఁగ నొల్ల! నాకుఁ గూర్తేని యనలాస్త్ర | మనఘ! నీవు గొనుము హయము లిమ్ము.
54
వ. ‘నీతోడ సఖ్యంబుఁ జేసెద; మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికి?’ తనిన గంధర్వుం డి ట్లనియె. 55
క. విమలము లయి లోకత్రిత | యమునఁ బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని
త్యము విందు నారదప్రము | ఖ మునీశ్వర సిద్ధసాధ్య గణములవలనన్‌.
56
క. మేరునగోత్తంసమహీ | భారధురంధరుల మిమ్ముఁ బాండవుల గుణో
దారుల ధీరుల నెఱుఁగని | వా రెవ్వరుఁ గలరె భరతవంశోత్తములన్‌.
57
వ. ఏను మిమ్ము నెఱింగియు, మీకు నగ్నిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి; మఱియును. 58
ఉ. ఇంతుల గోష్ఠి నున్నయతఁ డెంత వివేకము గల్గెనేని య
త్యంత మదాభిభూతుఁ డగు; ధర్మువు దప్పుఁ; బ్రియం బెఱుంగఁ; డే
నెంత వివేకి నయ్యును సహింపక యింతుల యొద్దఁ బల్కితిన్‌;
వింతయె? కాము శక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్‌!
59
క. సుర గరుడ విషోరగ య | క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో
పరు ధిక్కరింప బ్రాహ్మణ | పురస్కృతులఁ బుణ్యమతుల భూతలపతులన్‌.
60
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )