ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అంగారపర్ణుఁడు పాండవులకుఁ బురోహితునిఁ బురస్కరింపుఁ డని చెప్పుట (సం. 1-159-17)
సీ. అనవద్యు వేదవేదాంగ విశారదు | జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య
వచను విప్రోత్తము వర్గచతుష్టయ | సాధనసఖు సదాచారు సూరి
సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి | యేలు నుర్వీతలం బెల్ల; నిందుఁ
బరలోకమునఁ బుణ్యపరుల లోకంబులు | వడయు; జయస్వర్గఫలము సూవె
 
ఆ. రాజ్య; మదియు నుర్వరాసురవిరహితుఁ | డయిన పతికిఁ గేవలాభిజాత్య
శౌర్యమహిమఁ బడయ సమకూరునయ్య తా | పత్య! నిత్యసత్యభాషణుండ!.
61
వ. మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత రహితులరై యుండఁ దగదు. 62
ఆ. పాండుపుత్త్ర! నీవు బ్రహ్మచర్యస్థుండ | వగుటఁ జేసి మన్మథార్తు నన్ను
నొడిచి తిందు రాత్రి యుద్ధంబు సేసి; కా | మోపభోగనిరతుఁ డోటు వడఁడె?
63
వ. మఱియుఁ గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుం డగు నేని యెల్ల యుద్ధంబుల శత్రుల జయించు. 64
ఉ. వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యుఁ డగణ్యపుణ్య సం
పాది పురోహితుం డయినఁ బాపము పొందునె భూపతిం బ్రతా
పోదయ! కాన మీదగు గుణోన్నతికిం దగ ధర్మతత్త్వ సం
వేదిఁ బురస్కరింపుఁడు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌.
65
తే. అనిన వానికి నర్జునుం డనియె ‘మమ్ము | ననఘ! తాపత్యు లని పల్కి తతిముదమున
నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు | మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు’.
66
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )