ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
తపతీసంవరణోపాఖ్యానము (సం. 1-160-3)
వ. అనిన నర్జునునకు నంగారపర్ణుం డి ట్లనియె. 67
సీ. ఆదిత్యునకుఁ బుత్త్రి యనఘ సావిత్రికిని | ననుజ యుత్తమలక్షణామలాంగి
తపతి; యక్కన్య ధవళాయతేక్షణ | యౌవనసంప్రాప్త యైన, దానిఁ
జూచి యక్కన్యక సురుచిరగుణముల | కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుఁ
బతి నెవ్విధంబునఁ బడయుదునో యని | తలఁచుచు నున్న యత్తపనుగుఱిచి
 
ఆ. భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం | దనుఁడు భరతకులుఁడు ధర్మవిదుఁడు
సర్వగుణయుతుండు సంవరణుం డను | వాఁడు కృతజపోపవాసవిధుల.
68
చ. ‘గగనమునందు నెందు నధికప్రభ నేను వెలుంగు నట్టు లి
జ్జగతిఁ బ్రసిద్ధుఁడై వెలుఁగు సంవరణుండ మదీయపుత్త్రికిం
దగుపతి; వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి’ నంచు మా
నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపః ప్రసన్నుఁడై.
69
వ. అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి అధికక్షుత్పిపాసాపీడిత పతితతురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. 70
క. కనియె నొక కన్యఁ గోమలిఁ | గనకప్రభ నిజ శరీరకాంతి నుపాంతం
బున వృక్షలతావలిఁ గాం | చనమయముగఁ జేయుచున్న చంద్రనిభాస్యన్‌.
71
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )