ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
సంవరణుండు తపతింజూచి మోహించుట (సం. 1-160-25)
వ. కని యనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్కించె. 72
సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యేకాంత మి | ట్లేలొకో యున్నది యివ్వనమున,
గగనమణిప్రభ గగనంబునం దుండి | యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ
శంభుండు లావణ్యసద్గుణసముదాయ | మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ
దీని యంగములఁ బొందిన యివ్విభూషణ | శ్రీ యేమి పుణ్యంబుఁ జేసె నొక్కొ
 
ఆ. యమరకన్యయొక్కొ యక్షకన్యక యొక్కొ | సిద్ధకన్య యొక్కొ శ్రీసమృద్ధి
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య | కన్య యగు ననంతకాంతిపేర్మి.
73
చ. నెఱికురులున్‌ విలోలసితనేత్రయుగంబును నొప్పులొల్కు వా
తెఱయును దీని యాననముతెల్వి కరంబు మనోహరంబు; నా
యెఱిఁగిన యంతనుండి సతి నిట్టిలతాలలితాంగిఁ జూచి యే
నెఱుఁగ; సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్‌.
74
వ. అని వితర్కించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయగుణమయపాశబద్ధుండునుం బోలెఁ గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలెఁ ద న్నెఱుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె. 75
ఆ. ఎఱుఁగఁ జెప్పు మబల! యెవ్వరి దాన; వి | ట్లేల యున్నదాన వేకతంబ;
క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ | విజన విషమ శైల విపిన భూమి.
76
క. అని పలుకుచున్న నృపనం | దనునకు మఱుమాట యీక తామరసనిభా
నన మేఘమధ్యసౌదా | మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌.
77
వ. ఇ ట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి ప్రలాపించు చున్న, నాతని నభినవయౌవనవిభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణబాధిత యై, తన రూపంబుఁ జూపి మధురవచనంబుల ‘ని ట్లేల మోహగతుండ వయి?’ తని పలికిన, దానికి సంవరణుం డి ట్లనియె. 78
చ. ధరణి నతిప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద; నె
వ్వరికిని మున్‌ భయంపడనివాఁడ; భయార్తుఁడ నైతి నిపు;; పం
కరుహదళాయతాక్షి! దయఁ గావుము నన్ను; భవన్నిమిత్త దు
ర్భరతర పంచబాణహతిఁ బంచతఁ బొందకయుండునట్లుగన్‌.
79
వ. ‘నన్ను గాంధర్వవివాహంబున వరియింపు’ మనిన సంవరణునకుఁ దపతి యి ట్లనియె. 80
క. భువనైకదీపకుం డగు | సవితృనకుఁ దనూజ; మఱియు సావిత్రికి నే
నవరజ, నవినయవర్జిత | నవనీశ్వర! వినుము తపతి యను సురకన్యన్‌.
81
వ. ‘నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము; న న్నిచ్చు; నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుంగుదువు గాదె! కావున ననవరతజపనియమప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు’ మని చెప్పి తపతి యాదిత్యమండలంబున కరిగె; నంత సంవరణుండు మూర్ఛాగతుం డయి పడియున్న, నాతని యమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ఛదేఱి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు. 82
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )