ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
వసిష్ఠుఁడు తపతినిఁ గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట (సం. 1-162-12)
చ. ప్రతిహత రాగ కోపభయుఁ బంకరుహప్రభవప్రభావు దూ
రితదురితున్‌ మునీశ్వరవరిష్ఠు వసిష్ఠమహామునిం బురో
హితు నతిభక్తితోఁ దలఁచె; నిష్ట మెఱింగి వసిష్ఠుఁడున్‌ సమా
హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌.
83
వ. ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ఠుం డవిరతవ్రతోపవాసకృశీభూతశరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తన యోగ దృష్టి నెఱింగి. 84
చ. జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం
బొగి నొనరింపఁగా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం
డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న
త్యగణితవేదమంత్రముల నమ్మునినాథుఁ డతిప్రియంబునన్‌.
85
వ. సూర్యుండును వసిష్ఠమహాముని నతిగౌరవంబున సంభావించి ‘భవదాగమన ప్రయోజనంబు సెప్పు’ మనిన వసిష్ఠుం డి ట్లనియె. 86
సీ. ‘అలఘుండు పౌరవకులశేఖరుండు సం | వరణుఁ డన్వాఁ డనవరత కీర్తి
విదితుండు ధర్మార్థవిదుఁడు నీ పుత్త్రికి | నగణిత గుణములఁ దగు వరుండు
గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ | వలయుఁ; గూఁతులఁ గన్నఫలము దగిన
వరులకు సద్ధర్మచరితుల కీఁ గాన్ప | కాదె!’ నావుడు సూర్యుఁ డాదరించి
 
ఆ. ‘వరుఁడు రాజవంశకరుఁడు సంవరణుండ | యనుగుణుండు దీని’ కని కరంబు
గారవమున నిచ్చి యా ఋషితోడఁ బు | త్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు.
87
వ. ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగు యోజనంబులు పఱచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ; గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. 88
క. ఆ తరుణియందుఁ జేతో | జాత సుఖప్రీతిఁ దగిలి శైలాటవులన్‌
వీతనృపకార్యధర్మ | వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్‌.
89
వ. ‘దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్ఠుండు శాంతికపౌష్టికవిధు లొనరించి, సంవరణుం దోడ్కొని హస్తినాపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె; ననావృష్టి దోషంబునుం బాసె; నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టె, నది మొదలుగా మీరును దాపత్యుల రయితి’ రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె. 90
క. నుతముగ నస్మత్కుల భూ | పతులకు నాద్యులకుఁ బుణ్యభాగులకుఁ బురో
హితుఁ డయిన వసిష్ఠ మహా| త్మతఁ జెప్పుము వినఁగ వలతు మది నేర్పడఁగన్‌.
91
వ. అనిన గంధర్వుం డి ట్లనియె. 92
క. ధృతి నెవ్వని నేని పురో | హితుఁగాఁ బుణ్యమునఁ బడసి యిక్ష్వాకుకులో
దితు లైన పతులు రాజ్యో | న్నతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్‌.
93
క. బలమఱి కామక్రోధం | బులు రెండు జయింపఁబడి తపోవీర్య బలం
బులఁ జేసి చేయునవి ని | చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్‌.
94
సీ. ‘శమహీనుఁ డైన విశ్వామిత్రు చేసిన | యపకారమునఁ జేసి యాత్మసుతులు
యమసదనంబున కరిగిన, వారలఁ | దనతపోవీర్యసత్త్వముల పేర్మిఁ
గ్రమ్మఱింపఁగ శక్తి కలిగియు, వేల న | య్యంబుధి గడవనియట్ల శాంతుఁ
డయి యెవ్వఁడేని కృతాంతకుఁ గడవంగ | నొల్లండ, యట్టి యత్యుగ్రతేజుఁ
 
ఆ. డగు వసిష్ఠముని మహాత్మతఁ జెప్ప నా | యలవియయ్య’! యనిన నవ్వసిష్ఠ
గాధిసుతుల కేమికారణంబున నిట్టి | వైర మయ్యె నెఱుఁగ వలతు దీని.
95
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )