ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అంగారపర్ణుఁడు అర్జునునకు వసిష్ఠుమహిమ చెప్పుట (సం. 1-165-2)
వ. చెప్పు మని యర్జునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పెఁ; దొల్లి కన్యాకుబ్జంబున గాధిపుత్త్రుండు విశ్వామిత్రుం డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు, నొక్కనాఁడు మృగయార్థం బరిగి, యపారబలసమేతుం డయి ఘోరారణ్యంబున గ్రుమ్మరి, వడంబడి కడు డస్సి వసిష్ఠునాశ్రమం బాశ్రయించిన, నమ్మునివరుండు విశ్వామిత్రు నతిప్రీతిం బూజించి, వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తన హోమధేనువుంబంచిన నదియు. 96
క. ఘృతనదులును, నోదన ప | ర్వతములు, దధి కుల్యములు, నవారిత రసపూ
రిత బహువిధోపదంశో | న్నత పుంజంబులును దత్‌క్షణంబునఁ గురిసెన్‌.
97
వ. ఇట్లు చతుర్విధాహారంబుల నందఱం దృప్తులం జేసి యున్న యా నందినిం జూచి విశ్వామిత్రుండు విస్మితుం డయి యాత్మగతంబున. 98
మధ్యాక్కర. మృదురోమములును, శంకునిభకర్ణముల్‌, మెత్తని వలుఁద
పొదుగును, నిడుదచన్నులును గుఱుచలై పొలుచు కొమ్ములును,
సదమలశరదిందుశంఖనిభ మైన చాయయుఁ గలుగు
మొద విది నిధి చేరినట్లు చేరె నిమ్మునికిఁ బుణ్యమున.
99
వ. అని పెద్దయుం బ్రొద్దు చింతించి తత్‌పరిగ్రహకుతూహలహృదయుం డయి విశ్వామిత్రుండు వసిష్ఠున కి ట్లనియె. 100
తే. దీనికంటెను నొప్పెడి వాని నొక్క | లక్ష మొదవుల నిచ్చెద నక్షయముగ
రాజ్యమయిన నిచ్చెద జగత్పూజ్య! నాకు | నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోడ.
101
చ. అనిన వసిష్ఠుఁ డి ట్లనియె; ‘నంత ధనంబును నట్టి రాజ్యముం
గొననగు నయ్య యిచ్చిడిపికుఱ్ఱికి? నీ కిది యేల? యేను దీ
నన పితృదేవతాతిథిజనంబులఁ దృప్తులఁ జేయుచుండుదున్‌;
జననుత! దీనిఁ బ్రోచుటయ చాలుఁ దపస్వుల కేల సంపదల్‌?’
102
వ. ‘దీని నొరున కీఁ గా’ దనిన నలిగి విశ్వామిత్రుండు ‘నేను క్షత్త్రియుండ నిగ్రహానుగ్రహసమర్థుండ, నీవు బ్రాహ్మణుండవు శాంతుండ; వేమి సేయ నోపుదు? దీనికి లక్షమొదవుల నీఁబోయిన నొల్లవ యిమ్మొదవు నవశ్యంబును బలిమి నైనం బరిగ్రహింతు’ నని నందినిం బట్టికొనఁ బంచినం బలుకక వసిష్ఠుండు చూచుచుండె. 103
ఆ. పరులవలన బాధ పొరయకుండఁగ సాధు | జనుల ధనము గాచు జనవిభుండు
కరుణ తప్పి తాన హరియించువాఁ డగు | నేని సాధులోక మేమి సేయు?
104
వ. ఇట్లు విశ్వామిత్రుండు వసిష్ఠు హోమధేనువుం బట్టికొనఁ బంచిన పట్టీక జనులవలని కశాదండతాడనంబులం బీడింపం యఱచుచు వసిష్ఠునొద్దకు వచ్చి యి ట్లనియె. 105
క. ‘న న్నేల యుపేక్షించితి? | రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే? వి
ద్వన్నాథ! యిదియు ధర్మువె?’ | యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్‌.
106
వ. తదీయాభిప్రాయం బెఱింగి నందినియుఁ దనవత్సంబుఁ బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందఱరేఁగి నిదాఘ సమయమధ్యందినదినకరమూర్తియుం బోలె దుర్నిరీక్ష్య యయి, యంగవిక్షేపంబున నంగారవృష్టిఁ గురియుచు, వాలంబున శబరులను, శకృన్మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళులను, ఫేనంబున దరదబర్బరు లను బుట్టించిన. 107
క. నలి రేఁగి కడఁగి తద్బల | ములు విశ్వామిత్రు సైన్యముల కేనుమడుం
గులు పెరిఁగి మూఁడుయోజన |ములు వాఱఁగ నెగిచె నొక్కమొగిఁ బ్రతిబలమున్‌.
108
వ. అట్టి బ్రహ్మతేజోజనితం బయిన ప్రభావంబుఁ జూచి విశ్వామిత్రుండు విలక్షముఖుం డై, క్షాత్రబలంబు నిందించి, యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని. 109
చ. పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్లఁ దృణంబుగా మదిం
దలఁచి విరక్తుఁ డై విడిచి, దారుణశైలవనాతరంబులన్‌
వెలయఁ దపంబు సేసి, గుణవిశ్రుతుఁడై పడసెన్‌ మహాతపో
బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వము దివ్యశక్తియున్‌.
110
వ. ఆ విశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవు డైన కల్మాషపాదుం డను రాజునకు యాజకత్వం బపేక్షించి తత్పురోహితుం డైన వసిష్ఠుతో బద్ధవైరుం డయి, తదపకారంబు రోయుచున్నంత, నొక్కనాఁడు కల్మాషపాదుండు వేఁట పోయి, రమ్యారణ్య భ్రమణ ఖిన్నుం డయి, విశ్రమార్థంబు వసిష్ఠాశ్రమంబునకుం జనువాఁడు దన కభిముఖుం డయి వచ్చువాని వసిష్ఠు పుత్త్రుం బుత్త్రశతాగ్రజు నధికతపశ్శక్తియుక్తు శక్తియనుమహామునిం గని, తెరువు దొలంగు మని రాజాభిమానంబున మెచ్చక పలికిన, నమ్మునివరుం డి ట్లనియె. 111
ఆ. ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు | రరుగుదెంచు నప్పు డధికభక్తిఁ
దెరలి ప్రియము వలికి తెరువిత్తు రిట్టిద | ధర్ము; వీవు దీనిఁ దలఁప వెట్టు?
112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )