ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
శక్తిమహాముని కల్మాషపాదుని శపియించుట (సం. 1-166-7)
వ. ‘ఏను ధర్మపథంబున నున్నవాఁడ; నేల తొలంగుదు’? ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోలనమ్మునీంద్రుని వ్రేసిన నవమానితుం డయి కోపారుణితనయనంబుల నతనిం జూచి ‘నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు’ మని శాపం బిచ్చినఁ, గల్మాషపాదుం డమ్మహామునివరు వసిష్ఠతనయుంగా నెఱింగి ‘నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు’ నని ప్రార్థించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెఱుంగకుండ నంతర్హితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ, నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాఁడు విశ్వామిత్రునాదేశంబునను, శక్తిశాపంబుననుం జేసి కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత. 113
తే. రాక్షసావిష్టుఁ డైనప్డు రాజ్యలీల | విడిచి త న్నెఱుంగక, తదావేశరహితుఁ
డైన యప్పుడు రాచకార్యంబులందు | బద్ధబుద్ధి యై కల్మాషపాదుఁ డుండె.
114
వ. ఆ కల్మాషపాదు నొక్కనాఁ డొక్కబ్రాహ్మణుం డధిక క్షుధార్తుం డయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి, పోయిన వాఁ డంతఃపురంబున నుండి మఱచి యర్ధరాత్రంబునప్పుడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి ‘యే నొక్కబ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మఱచియుండితిం; జెచ్చెర నవ్విప్రునకు మాంసంబుతోఁ గుడువంబెట్టు’ మని పంచిన, వాఁడు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు డారాజు రాక్షసాధిష్ఠితుం డగుటం చేసి ‘మనుష్యమాంసంబుతో నయినం గుడువం బెట్టు’ మనిన సూపకారుండు వధ్యస్థానంబునకుఁ జని మనుష్య మాంసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన, నవ్విప్రుండు దన దివ్యదృష్టిం జూచి దాని మానవమాంసంగా నెఱింగి కడు నలిగి. 115
క. ‘తివిరి యభోజ్యం బగు మా | నవ మాంసముతోడ భోజనము పెట్టినవాఁ
డవు నీవు మనుష్యాదుఁడ | వవు’ మని వాఁ డిచ్చె శాప మన్నరపతికిన్‌.
116
వ. ఇట్లు బ్రాహ్మణ శాపంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి, రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి ‘నీ కారణంబున నిట్టి శాపవ్యాపారంబు సంభవించె; దీని ఫలంబు ముందఱ నీవ యనుభవింపు’ మని శక్తి నపగత ప్రాణుం జేసి, విశ్వామిత్రుచేతఁ బ్రచోదితుం డయి పదంపడి వసిష్ఠపుత్త్రుల నందఱ వధియించిన. 117
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )