ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పుత్త్రశోకమున వసిష్ఠుఁడు ఆత్మహత్యకుఁబ్రయత్నించుట (సం. 1-166-40)
తే. సుతుల రాక్షసనిహతులఁ జూచి పరమ | యోగధరుఁ డయ్యుఁ బుత్త్ర వియోగశోక
భరము దాల్చె వసిష్ఠుం డపారభూరి | ధరణిభరము నగేంద్రుండు దాల్చునట్లు.
118
చ. అమిత వివృద్ధ శోక వివశాత్మకుఁ డై మది నాత్మఘాతదో
షమును దలంప కెంతయు విషాదమునన్‌ బలవద్దవాగ్ని మ
ధ్యము వడిఁ జొచ్చినన్‌ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు
ష్ణము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్‌.
119
ఉ. పంబిన శోక భారమునఁ బ్రాణ విమోక్షముఁ గోరి కంఠ దే
శంబున రాయి గట్టికొని సన్మునినాథుఁడు నిశ్చితాత్ముఁడై
యంబుధిఁ జొచ్చినం గడు భయంపడి వార్ధి లసత్తరంగ హ
స్తంబుల నెత్తిపట్టె నుచితస్థితిఁ దీరముఁ జేర నమ్మునిన్‌.
120
చ. సుతశతవర్జితాశ్రమము చూడఁగ నోపక మేరుపర్వతో
న్నతపృథుశృంగ మెక్కిపడినన్‌, మునివల్లభుదేహబంధ మ
క్షత మయి తూలసంచయనికాశత నొప్పె; ననంత సంతత
వ్రతనియమప్రభావు లగువారలఁ బొందునె దేహదుఃఖముల్‌.
121
మధ్యాక్కర. వదలక మరణార్థి యగుచు మునినాథవరుఁడు దా నొక్క
నది నుదగ్రగ్రాహవతిఁ బ్రవేశించినను ముని నంట
నది యోడి శతవిధంబులఁ బరిద్రుతయయి స్థలం బయిన
నది యాదిగాఁగ శతద్రునామ యై యన్నది యొప్పె.
122
మధ్యాక్కర. ఘనపాశములఁ జేసి యెల్ల యంగముల్‌ గలయ బంధించి
కొని యొక్కనదిఁ జొచ్చి మునిఁగినను వంతఁ గూరి యన్నదియుఁ
దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథుఁ
బనుగొనఁ దీరంబు చేరఁ బెట్టి విపాశనాఁ బరఁగె.
123
వ. ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డయ్యును నప్రాప్తమరణుం డయి వసిష్ఠుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు దన పిఱుంద వచ్చు కోడలి నదృశ్యంతి యను దాని శక్తిభార్య నప్పు డెఱింగి, దాని యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి. 124
తే. శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు | వీనులకు నిది యమృతోపమాన మయ్యె
వేదనాదంబు; దీని పుణ్యోదరమున | నున్నవాఁడు సుతుండు విద్వన్నుతుండు.
125
వ. ‘అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండేఁడులు గర్భంబునుండి సకల వేదంబులు ధరియించినవాఁ డీ పౌత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు’ నని వసిష్ఠుండు మరణ వ్యవసాయ నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత; నొక్కనాఁడు రాక్షసరూపధరుం డై రౌద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం జూచి యదృశ్యంతి వెఱచిన దాని నోడుకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి, వానిపయి మంత్రపూతంబు లైన కమండలుజలంబు లొలికిన. 126
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )