ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
వసిష్ఠువలనఁ గల్మాషపాదుండు శాపవిముక్తిఁ జెందుట (సం. 1-168-5)
క. భూపాలకుండు బ్రాహ్మణ | శాపంబునఁ బదియురెండుసంవత్సరముల్‌
పాపమతి నుండి రాక్షస | రూపము చెడి యపుడు మనుజరూపముఁ దాల్చెన్‌.
127
వ. ఇట్లు శాపవిముక్తుం డై కల్మాషపాదుండు వసిష్ఠునకు నమస్కరించి ముకుళితకరకమలుఁ డై ‘మునీంద్రా! నీ ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్థుండ నయితి’ ననిన వానికి వసిష్ఠుం డి ట్లనియె. 128
చ. గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుఁడ వై సమస్త ధా
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖ ముండు మింక బ్రా
హ్మణుల కవజ్ఞసేయక శమంబును చేకొను; మింద్రుఁడైన బ్రా
హ్మణుల కవజ్ఞసేసి యవమానముఁ బొందుఁ బ్రతాపహీనుఁడై.
129
వ. అని కఱపిన నట్లచేయుదు నని యమ్మహీపతి వసిష్ఠుం దోడ్కొని, యయోధ్యాపురంబున కరిగి, సకల ప్రజానురాగ కరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచుఁ, దొల్లి రాక్షసుం డయి మదయంతీ సహితంబు వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు ఋతుకాలప్రవృత్తి నున్నం గని యాఁ కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన, నతిదుఃఖిత యై యాబ్రాహ్మణభార్య పరమ పతివ్రత యాంగిరసి యనునది పురుషవియోగంబునం బుత్త్రార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి, ‘వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు’ మని శాపం బిచ్చి వసిష్ఠువలన నీకుఁ బుత్త్రలాభం బగు నని చెప్పి, యగ్నిప్రవేశంబు సేసినం, బదంపడి దీని నంతయు మదయంతివలన నెఱింగినవాఁ డై, తనకుఁ బుత్త్రోత్పాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్త్రార్థి యయి వసిష్ఠున కి ట్లనియె. 130
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )