ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
వసిష్ఠప్రసాదంబునఁ గల్మాషపాదుఁడు పుత్త్రవంతుఁడగుట (సం. 1-168-11)
క. మనుకుల పవిత్రుఁ బుత్త్రకు | నినసన్నిభు! నాకుఁ బడయు; మే నట్లయినన్‌
మునినాథ! నీ ప్రసాదం | బునఁ బితరులవలన ఋణవిముక్తుఁడ నగుదున్‌.
131
వ. అని తన భార్యయైన మదయంతి యనుదానిని ఋతుమతి సమర్పించిన, నదియు వసిష్ఠుప్రసాదంబున గర్భిణి యయి పండ్రెండేఁడులు గర్భంబు మోచి వేసరి, యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబుఁ జేసిన నశ్మకుం డను రాజర్షి పుట్టె; నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ఠ నిర్మిత జాతకర్మాదికుండయి పెరుఁగుచు నొక్క నాఁడు రాక్షసభక్షణంబునం దనజనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమాన హృదయుం డయి ‘తపోమహత్త్వంబున నఖిలలోకసంహారంబు సేయుదు’ నని యున్న మనుమని వారించి వసిష్ఠుం డి ట్లనియె. 132
సీ. వినవయ్య! కృతవీర్యుఁ డను జనపతి దొల్లి | భృగు వంశ యాజ్యుఁ డై పెక్కుక్రతువు
లొనరించి, యగణిత ధనదానముల వారిఁ | దృప్తులఁ గావించి దివికిఁ జనిన,
నతనివంశమున వా రతిధనలుబ్ధులై | కృత్యవీర్యు ధనమెల్లఁ గ్లప్తి సేసి
కొని డాఁచియున్న వా రని భార్గవుల నెల్లఁ | బలికిన భార్గవుల్‌ భయము వొంది.
 
తే. కొంద ఱర్థము వారిక కూర్చి యిచ్చి; | రవనిసురవంశ్యులకు నిచ్చి రందుఁ గొంద,
ఱెవ్వరికి నీక తమ తమ యిండ్లఁ బాఁతి | కొని సుఖం బుండి రధము లై కొంద ఱందు.
133
వ. అంత నా క్షత్త్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబు గని యలిగి, రాజధన వంచకులై రని భార్గవుల నెల్ల నిగ్రహించి, గర్భంబుల నున్న యర్భకులు మొదలుగా వధించిన, వెఱచి భార్గవుల భార్యలెల్ల హిమవంతంబునకుం బాఱిన; నం దొక్క భృగుపత్ని భయంపడి, తన యూరుదేశంబున గర్భంబు ధరియించిన, నెఱింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందఱ. 134
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )