ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
భార్గవుండైన ఔర్వునిజననము (సం. 1-169-20)
క. భువనోపప్లవసమయో | ద్భవ భానునిభప్రభావిభాసితుఁ డయి భా
ర్గవుఁ డూరుదేశమున ను | ద్భవించె మహి వెలుఁగుచుండఁ బ్రభ నౌర్వుఁ డనన్‌.
135
మ. అమితౌజుం డగు వానిఁ జూచి కృతవీర్యామ్నాయజ క్షత్త్రియా
ధములెల్లన్‌ హతదృష్టు లై కృపణతం దత్పర్వతారణ్యదే
శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బ్రతిక్రూరక
ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే.
136
వ. అ ట్లా క్షత్రియు లందఱు నంధు లై భృగుపత్ని యొద్దకు వచ్చి, మాకు దృష్టిదానంబుఁ బ్రసాదింపవలయు నని వేఁడిన నది వారల కి ట్లనియె. 137
మధ్యాక్కర. ఏను మీ దృష్టులు గొన్నదానఁ గా; నిక్కుమారుండు
భానుతేజుండు మీచేఁ దనగురులు పరిభూతు లయిన
దానికి నలిగి మీ పాపబుద్ధికిఁ దగ నిట్లు సేసె;
వీని మే రెఱుఁగరె భార్గవకులము వెలిఁగించువాని.
138
వ. ‘ఇ క్కుమారుండు నూఱు సంవత్సరములు నా యూరు గర్భంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవాఁడు, మహాతపోనిధి; మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం’, డనిన, నాక్షత్త్రియులు నతిభక్తులై యౌర్వుం బ్రార్థించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు దుఃఖించి, సకలలోక ప్రలయార్థంబుగా ఘోరతపంబు సేయందొడంగిన. 139
చ. అతని తపంబు పెంపునఁ జరాచరసంభృతమైన విష్టప
త్రితయము భీతిఁ బొందిన, ధృతిం బితృలోకనివాసు లైన త
త్పితృవరు లెల్ల వచ్చి కడుఁ బ్రీతి నపాకృత గర్వు నౌర్వు న
ప్రతిమతపోవిభాసిఁ గని పల్కిరి తద్దయు శాంతచిత్తులై.
140
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )