ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పితృదేవతలు ఔర్వుని శాంతచిత్తునిఁ జేయుట (సం. 1-170-14)
వ. ‘అయ్యా! నీ తపో మహత్త్వంబుఁ జూచి లోకంబు లెల్ల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; మే మసమర్థుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము; ధనలుబ్ధుల మయి ధనంబు దాఁచినవారము గాము; ధనము వలసినం గుబేరుండు దాన మాకుఁ దెచ్చి యిచ్చుం; దపోమహత్త్వంబున మాకు నాయువు గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి దానిం బరిహరించి యా క్షత్త్రియులతో వైరం బమర్చికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోప్రదవంబు సేయవల; దిది మా కభీష్టం’ బనిన నౌర్వుండు వారల కి ట్లనియె. 141
మత్తకోకిల. మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్‌,
దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయ భాషిత మెన్నఁడు
న్నేని మోఘము గాదు దిగ్ధరణీరవీందు లెఱుంగఁగన్‌.
142
క. మతి మఱచి యనిస్తీర్ణ | ప్రతిజ్ఞుఁ డగు వాని కోపపటుదహన మని
ర్గత మయి వడి నరణి సము | త్థిత దహనమపోలె నాత్మదేహము నేర్చున్‌.
143
క. అలయక నిమిత్తజంబగు | నలుకను క్షమియించి శాంతుఁ డగు పురుషుం డి
మ్ముల రక్షింపఁగ నోపునె | పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్‌.
144
తే. పాపు లై క్షత్త్రియాధముల్‌ భార్గవులకు | నట్లు హింస గావించు నాఁ డార్తనాద
మూరుగర్భగతుండనై యుండి వినిన | నాఁడ కోప మసహ్యమై నన్నుఁ బొందె.
145
తే. ఎఱుక గలఁ డేని మఱి శక్తుఁ డేని యన్యు | లన్యులకు హింస గావించునపుడు దానిఁ
బూని వారింపకున్న నప్పురుషుఁ డేఁగు | హింస చేసినవారల యేఁగుగతికి.
146
వ. ‘కావున లోకంబులయందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును మీ వచనంబతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నా కోపదహనంబు నిగృహీతం బయిన నన్ను దహించు; నేమి సేయు వాఁడ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా నుపదేశింపుఁ’ డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి. 147
ఆ. జలములంద యుండు సర్వలోకంబులు | గాన నీ మహోగ్ర కలుష వహ్ని
జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ | వగుము; జలధి జలము నది దహించు.
148
వ. ‘అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబునఁ దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా నశ్వముఖంబున నబ్ధిజలంబులఁ ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడుకథ గావున నీవును నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు’ మనిన వసిష్ఠు వచనంబునం బరాశరుండు గోపం బుపసంహరించి, రాక్షసవినాశార్థంబుగా సత్త్రయాగంబు సేయం గడంగిన. 149
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )