ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పరాశరుఁడు రాక్షసవినాశార్థంబు సత్రయాగంబు సేయుట (సం. 1-172-2)
తే. శక్తి రాక్షసనిహతుఁ డై చనిన శోక | దహనహతుఁ డై వసిష్ఠుండు దానిఁ దలఁచి
కడుఁ బ్రశాంతాత్ముఁ డయ్యు రాక్షసవినాశ | మొలసి మనుమని వారింపకుండె నంత.
150
క. ఘోరాకారులు కృతహా | హారవులు సబాలవృద్ధు లయి పడిరి దురా
చారులు రాక్షసులు ముని | ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్‌.
151
వ. ఇట్లు పరాశరుండు గావించు సత్త్రయాగంబున నైన రాక్షసుకులప్రళయంబుఁ జూచి పులస్త్యపులహక్రతువులు మహామునిసంఘంబులతో వసిష్ఠాశ్రమంబునకు వచ్చి. 152
క. అగ్నిహతిఁ జేసి మానవ | భుగ్నివహము మరణబాధఁ బొందించుచు మూఁ
డగ్నులయొద్దను నాలవ | యగ్నియనన్‌ వెలుఁగుచున్న యమ్మునినాథున్‌.
153
క. పరమతపోనిలయు దినే | శ్వరదీప్తిసహస్రతేజు శాక్తేయుఁ బరా
శరుఁ గని యందఱుఁ బ్రార్థిం | చిరి రాక్షసమారణంబు సేయకు మనుచున్‌.
154
వ. ‘పరాశరుండును బులస్త్యాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్త్రయాగం బుపసంహరించి, తన్నియోగంబున నయ్యగ్ని హిమవదుత్తరపార్శ్వంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె’ నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె. 155
ఉ. మాకు నతిప్రియుండవు సమస్తవిదుండవు చెప్పుమయ్య! యీ
లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు; దెవ్వనిం
బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యుఁ బురోహితుండుగాఁ
జేకొనువార? మట్టి బుధసేవితుఁ గానఁగ మాకు నెం దగున్‌?
156
వ. అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి ‘యిచ్చోటికిం గుఱంగట నుత్కచం బను పుణ్యతీర్థంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁ బ్రార్థింపుం; డమ్మహాత్ముండు మీకుఁ బురోహితుం డైన సర్వార్థసిద్ధి యగు’ ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి ‘మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద’ మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు. 157
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )