ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పాండవులు ధౌమ్యునిఁ బురోహితుఁగా వరియించుట (సం. 1-174-6)
ఉ. వీత సమస్త దోషుఁ డయి వేడ్క దపం బొనరించుచున్న వి
ఖ్యాతుఁ బురోహితప్రవరుఁగా వరియించిరి భక్తితో జగ
త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్మికు ధౌమ్యు దేవల
భ్రాతృవరున్‌ మహాత్ము హితభాషణు భూసురవంశభూషణున్‌.
158
వ. ధౌమ్యుండును వారి నతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె; నట్లు తేజోరూపబుద్ధివిభవంబుల బృహస్పతిసదృశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగాఁ బడసి, పాండునందను లశేష మహీరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, తత్కృతస్వస్త్యయను లయి, జననీ సహితంబు దక్షిణ పాంచాలం బున కరుగువారు ముందఱ ద్రుపదుపురంబునకుఁ బోయెడు బ్రాహ్మణులం గని ‘మీ రెందులకుం బోయెద’? రని యడిగిన వా రి ట్లనిరి. 159
సీ. యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేదిఁ | గవచశరాసనఖడ్గబాణ
రథయుక్తుఁ డై మహారథుఁడు ధృష్టద్యుమ్నుఁ | డన నుదయించిన, నతనితోడ
నొక్కటఁ బుట్టిన యక్కన్యకను గృష్ణ | నసితోత్పల శ్యామలామలాంగి
మెఱుపునుం బోలెను వఱలు నుత్పలగంధి | బంధుర తను సౌరభంబు గలుగు
 
ఆ. దాని ద్రుపదరాజుతనయఁ దదీయ స్వ | యంవరోత్సవంబు నపుడు చూడఁ
గనినవారు దృష్టు గ్లనిన ఫలం బెల్లఁ | గనినవారు పరమకౌతుకమున.
160
వ. అట్టి మహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద; మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం దరుణులును నపారభూరిదక్షిణయజ్ఞకరులును ననేకశ స్త్రాస్త్రవిదులును నయిన నానాదేశాధిపతులు నింతకుఁ జనుదెంతు; రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు; రట్టె మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటఁ బోదము రండు. 161
క. మీ యం దీ కృష్ణు నుదం | సాయతభుజుఁ జూచి తాన హర్షముతోడం
దోయజముఖి వరియించును | మా యెఱిఁగినకార్య మిది సమంజసబుద్ధిన్‌.
162
వ. అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడఁ బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర. 163
క. కృష్ణమృగాజినధరుఁ దరు | ణోష్ణద్యుతితేజుఁ బంకజోద్భవసదృశుం
గృష్ణద్వైపాయను గత | తృష్ణామయుఁ గాంచి రరుగుదెంచు మహాత్మున్‌.
164
వ. కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందఱు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనినఁ; బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్ణిల్లి మ్రోయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత మహీనాథుల బహువిధస్కంధావారంబులఁ జూచుచుం జని, యొక్కకుంభకారగృహంబున విడిసి, త మ్మెవ్వరు నెఱుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతఁ, బాంచాలపతి పార్థునకుఁ గూఁతు నీ సమకట్టి పాండవుల నన్వేషించి యెందునుం గానక. 165
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )