ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రౌపదీస్వయంవరము (సం. 1-176-11)
సీ. వైహాయసం బైన వరమత్స్యయంత్రంబు | ని వ్విల్లు మోపెట్టి యెవ్వఁ డేను
శరముల నేయు నశ్రమమున నతఁడ నా | తనయకు వరుఁ డగు ధర్మయుక్తి
నని చాటఁ బంచిన నా ఘోషణము విని | యుర్వీశులెల్ల నొండొరులఁ గడవఁ
గడువేడ్కఁ దొడి పూసి కట్టి విభూతితోఁ | దమతమచిహ్నముల్‌ దనరి యెఱుక
 
ఆ. పడఁగ వేఱువేఱ పన్ని భూతలము గ్ర | క్కదల సైన్యపాదఘట్టనమునఁ
బొలుచు ద్రుపదరాజపుత్త్రీస్వయంవర | రంగమునకుఁ జనిరి రమణతోడ.
166
వ. అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి, యగాధోన్నత పరిఖాప్రాకారంబులను విశాలద్వారతోరణంబులను గైలాసశైలవిలాసాపహాసిభాసురగగనతలోల్లేఖిశిఖర రమ్యహర్మ్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పుచున్న, నందు యథాస్థానంబుల నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించెఁ; బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి సంతసిల్లి రంత. 167
సీ. ధవళవిభూషణ దామానులేపనా | మలినాంగి సితపుష్పమాల చేతఁ
గొని పుష్పసాయకు కుసుమేతరం బైన | యాఱగు సాయకం బనఁగ జనులు
ధవళాక్షి రంగమధ్యంబునఁ దనుమధ్య | దా నొప్పి పాంచాలతనయ యున్న
భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు | విలసిల్లె నాశీర్వివృద్ధితోడ
 
ఆ. ద్రుపదపతి పురోహితుండును గృతపరి | స్తరణుఁ డై ప్రయోగదక్షుఁ డగ్ని
ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప | కరణ వస్తుచయము గాచియుండె.
168
వ. అట్టి యవసరంబున బోరన మ్రోయు జనులయులివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు మూఁగినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీపంబున గంధపుష్పధూపదీపార్చితం బైన విల్లును నమ్ములను వైహాయసం బైన లక్ష్యంబును వారలకుం జూపి యి ట్లనియె. 169
తరువోజ. ఈ విల్లు మోపెట్టి యేను బాణముల | నీ యంత్రమత్స్యంబు నేసినవాఁడ
భావజప్రతిముఁ డిబ్బాలకుఁ దగిన | పతి; యిది మునిశక్తిఁ బడసిన విద్య;
గావున మీ రిప్డు గావింపుఁ డిదియ | ఘనతర కార్ముక కౌశలోన్నతియు
లావును గలవారలకు నవసరము | లలితయశంబుఁ గల్యాణంబుఁ బడయ.
170
వ. అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్త్రులకు నెల్ల నెఱుంగ జెప్పి, ద్రుపదరాజపుత్రిం జూచి ‘యఖిలజలధి వేలావలయవలయిత మహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు; వీరలం జూడు’ మని దుర్యోధనదుశ్శాసనదుర్ముఖప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం, దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్శ్రుతసేనాదులను, బుత్త్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ యుయుధాన ప్రముఖులైన యదువృష్ణి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణిమ జ్జనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి. 171
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )