ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
రాజపుత్త్రులు మత్స్యయంత్రమును భేదింపఁబోయి భంగపడుట (సం. 1-177-22)
ఆ. ‘ఇందు లక్ష్య మెవ్వఁ డేసె నాతని వరి | యింపు నెమ్మితోడ నిందువదన!’
యనిన రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్టి | యేయఁ గడఁగి కదలి రెల్లవారు.
172
సీ. అమ్మహోత్సవము నెయ్యమ్మునఁ జూడంగఁ | దివిరి యేతెంచిన దివిజ ఖచర
గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్‌ | విలసిల్లె నంబరతలమునందుఁ;
బణవవీణావేణురణితానుసార మై | రసగీతరవ మెల్ల దెసల నెసఁగె;
బోరన వివిధతూర్యారవంబులు మహా | వననిధిధ్వానంబు ననుకరించె;
 
ఆ. దివ్యమాల్యములయు దివ్యానులేపన | ములయు సౌరభంబు వెలయఁ దాల్చి
రంగమధ్యజనులకుం గడు తనుపుగాఁ | జేరి వీచె దివ్య మారుతంబు.
173
చ. అవిరళభస్మమధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా
దవ వృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి నెఱింగి, పార్థుఁ డీ
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్‌ హృదయంబులోపలన్‌.
174
వ. అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమ సామర్థ్యము నెఱుంగక యర్థిత్వంబున నవ్విల్లు మోపెట్టఁ బోయి. 175
క. వడి నౌడు గఱచి, వలకేల్‌ | నిడుచన గనయమునఁ బెనఁచి, నీల్గి, బలం బే
ర్పడ విల్లు వంపనోపక | యుడిగిరి నృపసుతులు గొంద ఱొయ్యన లజ్జన్‌.
176
క. బలవంతుల బలమఱఁగా | మలువక మ్రాన్మ్రానిపాట మాయాధను వి
మ్ములఁ జేసిన మోపెట్టఁగఁ | గొలఁదియె యని డాయ రైరి కొందఱు దానిన్‌.
177
మ. ‘ఇది యెట్లున్‌ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్టఁ బో
లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపఁగా
నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా’ దంచున్‌ విచారించి ని
ర్ముదు లై కొందఱు రాజు లేఁగిరి నిజక్ష్మామార్గముల్‌ చూచుచున్‌.
178
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )