ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అర్జునుఁడు మత్స్యయంత్రంబుఁ దెగ నేయుట (సం. 1-179-4)
వ. ఇట్లు రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి; మఱి యదు వృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి; రంత శిశుపాల జరాసంధ శల్యకర్ణులు దర్పితు లై తమ తమ లావులు మెఱసి క్రమంబున నలువురు మాష యవముద్గరోమమాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన; వారలం జూచి యగ్రజు ననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన, నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందఱు బ్రాహ్మణులు దమలో ని ట్లనిరి. 179
ఉ. ఇ మ్మనుజేంద్రనందను లహీనబలుల్‌ దృఢదీర్ఘ బాహువీ
ర్యమ్ములవార లోపర శరాసనకర్మమునం; దయుక్త ద
ర్పమ్మున నిప్డు నవ్వు పఱుపన్‌ సమకట్టె నితండు విప్రవం
శమ్మునవారినెల్లఁ దనశక్తి యెఱుంగక దుర్విదగ్ధుఁ డై.
180
క. అనువారు, నందుఁ గొందఱు | ‘ఘనుఁ డీతఁడు; వీరికంటెఁ గార్ముక విద్యం
దనరిన వాఁ డయి దీనికి | మొనసెంగా; కన్యుఁ డిట్లు మొనయం గలఁడే!
181
మ. అమితోత్సాహుఁడు దీర్ఘ బాహుపరిఘుం డత్యంతతేజస్వి స
ద్విమలాచారుఁడు విప్రభక్తిపరుఁ డీ విప్రుండు విప్రప్రసా
దమునన్‌ విప్రుల కెల్ల సంతసముగాఁ దత్కర్మసంసిద్ధి ను
త్తముఁడై పొందెడు మంచు నుండిరి దయన్‌ ధాత్రీసురుల్‌ ప్రీతు లై.
182
వ. అంత న య్యర్జునుండు న వ్వింటిసమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్కారంబు సేసి, ధనువునకుఁ బ్రదక్షిణంబుఁ జేసి మ్రొక్కి దాని నెత్తికొని పూర్వపరిచితం బైనవిల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి, జను లాశ్చర్యంబునుం బొందుచుండ, నే నమ్ముల న మ్మత్స్యయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మణ క్షత్త్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి. 183
చ. ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తులఁ జేసి చూడ దు
ర్బలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్‌ మహా
బలయుతు; లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం
గలదె? చరాచరాఖిలజగంబులఁ బెద్దల కారె సద్ద్విజుల్‌.
184
క. నిమిషాంతరమున ని ట్ల | శ్రమమున మర్త్యులకు నేయ సమకూరునె యు
త్తముఁ డీతఁడు బ్రాహ్మణ రూ | పమున సురేశ్వరుఁడొ హరుఁడొ భానుఁడొ గుహుఁడో!
185
క. అని ధరణి నుండి పొగడెడు | జనుల నిరంతరరవంబు, జలధరమార్గం
బున నుండి పొగడు దివ్యుల | యనవరతరవంబు నొక్కఁ డయి కడు నొప్పెన్‌.
186
క. చెలఁగె సురదుందుభిస్వన | ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం
బులు వీచివీచి యార్చిరి | వెలయఁగ నరుమీఁదఁ బుష్పవృష్టియుఁ గురిసెన్‌.
187
వ. అ య్యవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె; నిట ధృష్టద్యుమ్న సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగె; నంత. 188
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )