ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రౌపది యర్జునుని వరించుట (సం. 1-179-22)
సీ. ధరణీశ నందనుల్‌ ద న్నతిప్రీతితోఁ | జూచుచు నుండంగ సుందరాంగి
తోయజదళనేత్ర ద్రుపదరాజాత్మజ | కమనీయ గజరాజగమనలీలఁ
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ | యౌవనోద్భాసితు నసితరత్న
రుచిరాంగు నంగజరూపు ధనంజయుఁ | దనచేతి సితపుష్పదామకమునఁ
 
ఆ. బొలఁతి ముదముతోడఁ బూజించె; నట్టియు | త్సవముఁ జూచి దాని సైఁప కపుడు
కౌరవేంద్రుఁ డాదిగాఁ గల భూపతు | లెల్ల నలిగి కలయు నేపు రేఁగి.
189
మత్తకోకిల. ఏల రాఁ బనిచెన్‌ మహీశుల నెల్లఁ జుట్టమపోలె ము
న్నేల సత్కృతిఁ జేసె నిందఱ? కిమ్మహారథు లుండఁగా
నేల కన్యక నిచ్చె విప్రున కిందు నేఁడు శఠుండు పాం
చాలుఁ, డిప్పుడ వీని నిర్గతసత్త్వుఁ జేయుద మాజిలోన్‌.
190
క. తన విద్య పేర్మి నృపనం | దనఁ బడసెను విప్రుఁ; డితని తప్పే? కడుదు
ర్జునుఁ డీ ద్రుపదుఁడు నృపతుల | ననయంబున మెచ్చఁ డయ్యె నతిగర్వితుఁడై.
191
వ. ‘ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాఁడు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున న వ్విప్రుతోడి దేమి? యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మఱువు సొచ్చె; నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె. 192
క. కడఁగి మదీయాస్త్రము లని | యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల
న్కడిఁది విషాహుల దర్పం | బుడిగించెదఁ దొలఁగి చూచుచుండుఁడు మీరల్‌.
193
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )