ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అర్జునుండు కర్ణునితో యుద్ధంబు సేసి జయించుట (సం. 1-181-3)
వ. అని తానును భీమసేనుండును గడఁగి రిపుబలంబుపయి నపరిమితశరంబు లేసె; భీమసేనుండు నొక్క వృక్షంబు వెఱికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె; నంత న య్యిద్దఱ మహా సంరంభంబుఁ జూచి విస్మితుఁ డై కృష్ణుండు బలదేవుని కి ట్లనియె. 194
సీ. ‘తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల | నెగచుచున్నవాఁ డింద్రతనయుఁ;
డాతని కెలన మహావృక్షహస్తుఁడై | యున్న వీరుండు వృకోదరుండు;
యంత్రంబు నరుఁ డేసి నప్పుడు పోయిన | యగ్గౌరవర్ణుండు యమతనూజుఁ;
డాతనితోడన యరిగిన యిరువురుఁ | గవల వా రర్కప్రకాశ తేజు’
 
ఆ. లనిన ‘లక్కయింట నగ్నిదాహంబున | నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాత్ము;
లెట్టి పుణ్యదినమొ యేవురఁ జూచితి’ | మనుచు సంతసిల్లె హలధరుండు.
195
వ. అంత. 196
క. కురుపతి సూడఁగఁ గర్ణుఁడు | నరుఁ దాఁకెను; శల్యుఁ డనిల నందనుఁ దాఁకెన్‌
సరభసమున, విస్మయ మం | దిరి ధరణీదేవమనుజదేవప్రవరుల్‌.
197
శా. కర్ణుండున్‌ విజయుండు నొండొరులఁ జుల్కం దాఁకి; చాపంబు లా
కర్ణాంతం బగుచుండఁగాఁ దిగిచి యుగ్రక్రోధులై యేసి; రా
పూర్ణంబయ్యెఁ దదీయ బాణతతి నంభోభృత్పథం బెల్ల; నా
స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్‌ దిక్చక్ర మెల్లన్‌ వడిన్‌.
198
క. వీరుఁడగు నరుని యేయు న | పార శరావలుల నడుమ వారింపంగా
నేరక యే టుడిగి మహా | శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్‌.
199
క. నా యెదురఁ జక్కనై యని | సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం
తేయుఁ డగు విజయునకుఁ గా | కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్‌.
200
క. నీ వప్రాకృతబలుఁడవు; | నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ
దేవకులోత్తమ! మెచ్చితి; | నావుడుఁ బార్థుండు గర్ణునకు ని ట్లనియెన్‌.
201
మధ్యాక్కర. ఏను నీ చెప్పిన వారిలోపల నెవ్వఁడఁ గాను;
గాని నే సర్వశస్త్రాస్త్రవిద్యలఁ గడుఁ బ్రసిద్ధుండ;
భూనుత బ్రహ్మతేజో-ధికుఁడ; నిన్నుఁ బోరిలో నోర్వఁ
గా నున్న వీరుండ; నొండు దక్కి లోఁగక చక్క నిలుము.
202
వ. అనిన విని కర్ణుండు బ్రహ్మతేజం బజేయం బని విజయుతోడియుద్ధం బొల్లక క్రమ్మఱియె; మఱిశల్య భీమసేనులు పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం ద్రెళ్ళ వైచిన. 203
ఆ. సెల్లుఁ డట్లు నేల ద్రెళ్ళి చెచ్చెర లేచి | యొడలు దుడిచికొనుచు నొయ్యఁ జనియె;
వానిఁ జూచి నగుచు మానుగా విప్రులు | భూరిసత్త్వు భీముఁ బొగడి రంత.
204
ఆ. పరశురాముఁ డొండె హరుఁ డొండె నరుఁ డొండె | గాక యొరులు గలరె కర్ణు నోర్వ!
బలిమి భీముఁ డొండె బలదేవుఁ డొండెఁ గా| కొరులు నరులు శల్యు నోర్వఁ గలరె!
205
వ. ‘వీ రెవ్వరో యెం దుండుదురో యెఱుంగవలయు’ నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్రు లెల్ల విస్మితు లయి యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె. 206
చ. పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి, తత్స్వయం
వరమునఁ బత్నిఁగాఁ బడసె వారిరుహాయత నేత్రఁ గృష్ణ నీ
ధరణిసురాన్వయోత్తముఁడు ధర్మవిధిం; జెపుఁడయ్య యింక నె
వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింపఁగన్‌.
207
వ. ‘వలవ దుడుగుం, డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్త్రులు దమతమదేశంబులకుం జని; రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్త్రిం దోడ్కొని వచ్చునంత. 208
సీ. ‘ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి | కడుఁ బెద్ద ప్రొ ద్దయ్యెఁ; గొడుకు లేల
మసలిరొ? కౌరవుల్‌ విసువక వైరంబు | గావించు పాపస్వభావు; లెఱిఁగి
క్రందునఁ జంపిరో? యందుల కేవురు | లీలతో నొక్కట నేల యరిగి?
రవ్యయుం డయిన వేదవ్యాసువచనంబు | నిక్కంబుగాకుండు నొక్కొ? వేల్పు
 
ఆ. లార! భూసురేశులార! మీ శరణంబ | కాని యొండుగతియుఁ గాన; నాకు
శరణ మగుఁడు; సుతులఁ గరుణతో రక్షింపుఁ’ | డనుచుఁ గుంతి వగచి వనరుచుండె.
209
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )