ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
అర్జునుండు ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట (సం. 1-182-1)
వ. అట్టి యవసరంబునఁ దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్నఁ, దదనంతరంబ భీమార్జునులు ద్రౌపదీసహితు లయి చనుదెంచి మ్రొక్కి ‘మే మొక్క భిక్ష దెచ్చితి’ మని తల్లికి నివేదించిన, నెఱుంగక యెప్పటి యట్ల కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని ‘మీ రేవురు నుపయోగింపుఁ’ డని కొడుకుల నియోగించి, భువన త్రయ రాజ్య లక్ష్మియుం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్జించి, యధర్మభీత యయి ధర్మతనయున కి ట్లనియె. 210
సీ. ‘ఈ తన్విఁ దోడ్కొని నీ తమ్ము లిరువురు | ప్రీతి నేతెంచి ‘యీ భిక్ష యెప్పఁ
గొను’ మని నాకుఁ జెప్పినను ‘నేవురు నుప | యోగింపుఁ’ డంటి; నాయుక్తి దొల్లి
యనృత మెన్నండుఁ గా దనఘ! మీ రెప్పుడు | మద్వచనాతిక్రమంబు సేయ;
రిది లోకమున లేని యది; యేమి సేయంగ | నగు?’ నని చింతాకులాత్మ యైనఁ
 
తే. దల్లి నూరార్చి, వాసవతనయుఁ జూచి | ‘పార్థ! నీచేతఁ బడయంగఁ బడిన దీని
నగ్ని సన్నిధిఁ బాణిగ్రహణంబు నీవ | చేయు’ మన ధర్మజునకును జిష్ణుఁ డనియె.
211
వ. ‘పెద్దవాఁ డుండఁ గొండుక వానికి వివాహం బగుట ధర్మ విరుద్ధంబు గావున దీని నగ్రమహిషిఁగాఁ బరిగ్రహింపుము; మా నలువుర యనుమతంబును నిట్టిద’ యనుచున్న యవసరంబున విధిప్రేరణవశంబున. 212
ఉ. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూ
పాల తనూజపంచకము పంచశరాహతిఁ బొందె నొక్కతన్‌
బాలికఁ దొల్లి యేవురకు భామినిఁగా సృజియించి యున్న య
య్యాలరి బ్రహ్మ చెయ్ది పరమార్థముగా కది యేల యొం డగున్‌.
213
వ. ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెఱింగి వేద వ్యాస వచనంబులుం దలంచి ధర్మతనయుండు దమ్ముల కి ట్లనియె. 214
క. గురువచనస్థితి మన కే | గురకును నిది పత్నిగాఁ దగుం గావున ని
త్తరుణిని బరిగ్రహింతము | తిరముగ; గురువచన మొండుదెఱఁ గేల యగున్‌.
215
వ. అని పలుకుచున్న యవసరంబున. 216
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )