ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పాండవుల వంశాదికము నెఱింగి ర మ్మని ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం బనుచుట (సం. 1-184-3)
వ. ‘సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్భుతకర్మం బర్జునునక కా కన్యులకుఁ జేయ శక్యంబె? యని యెఱింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెఱింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు ల గ్గుగు’ నని చెప్పి బలదేవసహితుం డయి వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దనకూఁతునకు వరుం డైన వాఁ డెవ్వఁడో యేవంశంబునవాఁడో వాని చరితం బెట్టిదో యెఱింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిఱుందన వచ్చి త న్నొఱు లెఱుంగకుండ నక్కుంభకారగృహంబున నుండి యంత వృత్తాంతంబు నెఱింగిపోయి ద్రుపదున కి ట్లనియె. 222
సీ. అ య్యిద్దఱును గృష న్ణ ట్లొప్పఁ దోడ్కొని | చని యొక్క ముదుసలి సాని కపుడు
మ్రొక్కి యక్కన్యను మ్రొక్కించి మఱియొక్క | గౌరవర్ణుఁడు పంపఁ గడఁకతోడ
నలువురు భూసురనాథగృహంబుల | కరిగి భైక్షము దెచ్చి యంతగూడు
నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న | య్యవ్వయు ద్రౌపది నర్థిఁ బిలిచి
 
ఆ. బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు | నన్నకాంక్షు లైన యధ్వగులకు
నగ్రమిందుఁ బుచ్చి యయ్యగ్రశేషంబుఁ | జెలువ రెండు పాళ్ళు సేయు మొనర.
223
క. వెడఁదయురంబును నన్నువ | కడుపును దృఢకఠినతనువుఁ గల యాతని కిం
దడర నొకపాలు వెట్టుము | వడి; నాగాయుతబలంబువాఁ డతఁ డబలా!
224
వ. ‘మఱియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్భుక్తశేషం బేనును నీవు నుపయోగింత’ మని పంచినఁ; గృష్ణయు నయ్యవ్వ పంచినరూపున నందఱకుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు విద్రిచి యందఱకు వేఱువేఱ శయనమ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజినంబులు పఱచి సుఖశయను లై యున్న వారి పాదంబులకు నుపధానభూత యై శయనించి. 225
ఆ. కఱకు దర్భపూరి పఱపులు; భిక్షాన్న | మశన; మట్టివారి నతిముదమున
నాదరించెఁ బ్రీతి; నాదిగర్భేశ్వరి | యయ్యు నేవగింపదయ్యెఁ గృష్ణ.
226
క. కడవసములుఁ గోలలుఁ గ | ప్పడములు వీరలధనంబు పరికింపఁగ నె
క్కడి దేశికు లని వగవక | మడవక తనుమధ్య నిండుమనమున నుండెన్‌.
227
సీ. ‘అంత నయ్యేవురు నయ్యయికథ లొప్పఁ | జెప్పుచు మఱి రథసింధురాశ్వ
విషయంబులును, సమవిషమ మహావ్యూహ | నిర్భేదనోపాయనిపుణవిధులు,
నాయుధవిద్యారహస్య ప్రయుక్తులుఁ | బలికిరి; పలికినబాసఁ జూడ
నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు; | చరితఁ జూడఁగ విప్రజాతు లగుదు;
 
ఆ. రెఱుఁగరాదు వారి; నీ రెండు జాతుల | వార కాని, కారు వైశ్య శూద్ర
హీనజాతు’ లనిన నెంతయు సంతస | మందెఁ బృషతపుత్త్రుఁ డాత్మలోన.
228
వ. వెండియు వారల నిమ్ముగా నెఱుంగవేఁడి తనపురోహితుం బుత్తెంచినం, బురోహితుండును బ్రాహ్మణ సమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్ఘ్యాదివిధుల నర్చితుం డయి యి ట్లనియె. 229
ఉ. మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెఱుంగవేఁడి చిం
తాకులు డైనవాఁడు ద్రుపదాధిపుఁ; డాతనికిం బ్రియంబుగా
నా కెఱిఁగింపుఁ డింతయు; ఘనంబుగ నద్భుతయంత్ర మత్స్యమున్‌
వీకున నట్టు లేసిన సువిక్రము నాతఁడు గోరుఁ జూడఁగన్‌.
230
వ. అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె. 231
క. ఇవ్వైహాయసలక్ష్యం | బివ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుం
డివ్వనితకు వరుఁ డగు నని | నెవ్వగ మీ రాజు చులక నియమము సేసెన్‌.
232
తే. అతని నియమించి నట్లు యయ్యంత్ర మేసి | యీతఁ డిక్కన్యఁ బడసె నుర్వీశు లొద్ద;
నేల మమ్ముఁ దా నెఱిఁగెడు? నెఱిఁగి యేమి | సేయువాఁ డింక మీ పతి సెప్పుమయ్య!
233
క. బలహీనుఁ డైన వానికి | నలవియె? మోపెట్టి తివియ న క్కార్ముకముం;
గులహీనున కకృతాస్త్రున | కలవియె? యా లక్ష్యమేయ? నశ్రమలీలన్‌.
234
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )