ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
పాండవులు ద్రుపదమహారాజు గృహంబునకుఁ బోవుట (సం. 1-185-25)
వ. ‘ మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల?’ యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి ద్రుపదున కెఱింగించిన; ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి ‘చాతుర్వర్ణ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి వారల దోడ్కొని ర’ మ్మని పంచిన వాఁడును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి ‘యీరథంబు లెక్కి మారాజునొద్దకు రం’ డనినఁ బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచన రథంబు లెక్కి కుంతీదేవిని, ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజనివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినఁ, బరార్థ్యంబు లైన యొండువస్తువులఁ బరిగ్రహింపక సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథ వాజివారణ నివహంబులఁ బరిగ్రహించి తనయొద్దకు వచ్చువారి. 235
సీ. అజినోత్తరీయుల నతిసంభృత బ్రహ్మ | తేజుల సముదితాదిత్యసముల
నాజానులంబి మహాబాహుపరిఘుల | నత్యున్నతాంసుల నతివిశాల
వక్షుల నవిరళవ్యాయామ ధృడ కఠి | నాంగుల వృషభాక్షు లయిన వారిఁ
బాండుకుమారుల భరతవంశేశులఁ | జూచి సుతభ్రాతృ సుహృదమాత్య
 
ఆ. బంధుజనులతోడఁ బరమవిద్వన్మహీ | సురగణంబుతోడ సోమకుండు
గరము సంతసిల్లె ఘనుల నత్యుత్తమ | క్షత్త్రవంశవరులఁ గా నెఱింగి.
236
వ. ‘మఱియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్త్రియోచితంబు లైన మహార్హాసనంబుల నున్నవారల రాజపుత్త్రులంగా నెఱింగియు, సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె ‘నయ్యా! మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబున నుండి వచ్చిన దివ్యులరో యెఱుంగము; మాకు సందేహం బయి యున్నయది; మీ కలరూ పెఱింగి కాని యిక్కన్య వివాహంబు సేయనేర’ మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె. 237
క. క్షత్త్రియులము, పాండుప్రియ | పుత్త్రుల; మే నగ్రజుండ, భూనుతులు మరు
త్పుత్త్రార్జునయము లమల చ | రిత్రులు నలువురును వీ రరిందము లెందున్‌.
238
వ. ‘వీరు కుంతీమహాదేవు’ లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెఱింగించిన, ద్రుపదుం డతిహర్షరసావేశపరవశుం డయి పెద్దయుం బ్రొద్దునకుఁ దెలిసి, యానందజలభరితనయనుం డగుచు ‘నా పుణ్యంబున లాక్షాగృహదాహం బువలన విముక్తుల రయితి’ రని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని, ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి, సామప్రియభాషణంబుల నభీష్టసత్కారంబులను వారిం బూజించి, యొక్కనాఁడు పుత్త్రమిత్రామాత్య బాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె. 239
క. సుత్రామపుత్త్రుఁ డభిజన | పాత్రుండు, విచిత్ర వీర్యుపౌత్త్రుఁడు, శుభ చా
రిత్రుం డీ విజయుఁడు మ | త్పుత్రికి వరుఁ డయ్యె నెట్టి పుణ్యోదయమో!
240
వ. ‘స్వయంవర లబ్ధ యయిన యి క్కన్యక నర్జునుండు ధర్మవిధిం బాణిగ్రహణంబు సేయువాఁ’ డనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె; ‘నది యె? ట్లేను వివాహం బైనఁ బదంపడి భీమసేనుండు వివాహం బయిన మఱి యర్జునుండు వివాహం బగుఁగాక! ముంద రర్జునునకుఁ బాణిగ్రహణంబు సేయ నె ట్లగు?’ ననిన ద్రుపదుండు ధర్మతనయున కి ట్లనియె. 241
తే. ‘అట్ల యగునేని యిక్కన్య నభిమతముగ | వసుమతీనాథ! నీవ వివాహ మగుము;
ధర్మమార్గ మెవ్వరికిని దప్ప నగునె?’ | యనిన నాతని కనియె ధర్మాత్మజుండు.
242
వ. ‘ఏన కా, దిక్కన్యక నే మేవురము వివాహం బయ్యెద; మస్మన్మాతృ నియోగం బిట్టిద; యది మాకు నలంఘనీయం’ బనిన విని విస్మితుం డై ద్రుపదుం డి ట్లనియె. 243
క. ఒక్క పురుషునకు భార్యలు | పెక్కం డ్రగు టెందుఁ గలదు; పెక్కండ్రకు నా
లొక్కత యగు టే యుగముల | నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్‌.
244
వ. ‘నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు ధర్మాత్మజుండవు; నీ పలుకులు ధర్మవిరుద్ధంబులు నా నోడుదు; మయినను లోకంబున నిది యశ్రుతపూర్వంబు; దీని నింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి యెల్లి నిశ్చయింత’ మని. 245
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )